పొలార్డ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌: ఒక్క ఫోర్‌ లేదు! అన్నీ సిక్సర్లే! | CPL 2024 Pollard Smashes 4 Sixes in Penultimate Over To Score 19 Ball fifty | Sakshi
Sakshi News home page

పొలార్డ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌: ఒక్క ఫోర్‌ లేదు! అన్నీ సిక్సర్లే!

Published Wed, Sep 11 2024 11:34 AM | Last Updated on Wed, Sep 11 2024 1:35 PM

CPL 2024 Pollard Smashes 4 Sixes in Penultimate Over To Score 19 Ball fifty

పొలార్డ్‌ (PC: CPT20)

వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాటర్‌ కీరన్‌ పొలార్డ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)-2024లో భాగంగా సెయింట్‌ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ మేరకు తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

రోస్టన్‌ చేజ్‌ హాఫ్‌ సెంచరీ
కాగా సీపీఎల్‌ తాజా ఎడిషన్‌లో పొలార్డ్‌  ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లూసియా కింగ్స్‌ సొంత మైదానంలో మెరుగైన స్కోరు సాధించింది. 

ఓపెనర్లు, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(26 బంతుల్లో 34), జె.చార్ల్స్‌(14 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. రోస్టన్‌ చేజ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన చేజ్‌ 40 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా భనుక రాజపక్స(29 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు. 

ఫలితంగా లూసియా కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. ట్రిన్‌బాగో బౌలర్లలో సునిల్‌ నరైన్‌, వకార్‌ సలామ్‌ఖీల్‌ రెండేసి వికెట్లు తీయగా.. టెర్రాన్స్‌ హిండ్స్‌, పొలార్డ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

ఆకాశమే హద్దుగా పొలార్డ్‌
ఈ క్రమంలో లూసియా కింగ్స్‌ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగోకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌(15 బంతుల్లో 16), సునిల్‌ నరైన్‌(8 బంతుల్లో 14) విఫలమయ్యారు. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ షకెరె పారిస్‌ 33 బంతుల్లో 57 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

సిక్సర్ల వర్షం
మిగతా వాళ్లలో నికోలస్‌ పూరన్‌(17), కేసీ కార్టీ(15) పూర్తిగా నిరాశపరచగా.. పొలార్డ్‌ రంగంలోకి దిగిన తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఆల్‌రౌండర్‌. ఏడు సిక్సర్ల సాయంతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

పందొమ్మిదో ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్‌లో అకీల్‌ హొసేన్‌ ఫోర్‌ బాదడంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ట్రిన్‌బాగో గెలుపు ఖరారైంది. లూయిస్‌ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసిన కీరన్‌ పొలార్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

సెయింట్‌ లూయీస్‌ వర్సెస్‌ ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ స్కోర్లు
లూయీస్‌ కింగ్స్‌- 187/6 (20 ఓవర్లు)
నైట్‌ రైడర్స్‌-  189/6 (19.1 ఓవర్లు)
ఫలితం- కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో నైట్‌ రైడర్స్‌ విజయం.

టాప్‌లో అమెజాన్‌ వారియర్స్‌
కాగా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ మూడు విజయాల(ఆరు పాయింట్లు)తో పట్టికలో టాప్‌లో ఉండగా.. బార్బడోస్‌ రాయల్స్‌ రెండింట రెండు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌మూడింట రెండు గెలిచి మూడు, ఆంటిగ్వా-బర్బుడా ఫాల్కన్స్‌ ఆరింట రెండు గెలిచి నాలుగు, సెయింట్‌ లూసియా కింగ్స్‌ నాలుగింట రెండు గెలిచి ఐదు, సెయింట్‌ కిట్స్‌- నెవిస్‌ పేట్రియాట్స్‌ ఆరింట ఒకటి గెలిచి అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.

చదవండి: హిట్‌మ్యాన్‌ మరో 10 పరుగులు చేస్తే..!

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement