
ఆక్లాండ్: స్థానికంగా జరిగిన ఓ కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య వివాదం గొడవకు దారితీసింది. సబర్బ్స్ న్యులిన్, హౌవిక్ పకురంగా క్లబ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో సబర్బ్స్ న్యులిన్ బౌలర్ అర్షద్ బషీర్(41)పై ప్రత్యర్ధి జట్టు ఆటగాడు దాడి చేయడంతో అతను కొన్ని నిమిషాల పాటు స్పృహ కోల్పోయాడు. వైడ్ బాల్ విషయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వివాదం మొదలవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వైడ్ బాల్ విషయంలో మోసం చేయొద్దని అనడంతో రెచ్చిపోయిన ప్రత్యర్ధి జట్టు ఆటగాడు.. గొంతు నులమడంతో పాటు తన ముఖంపై దాడి చేసి గాయపరిచాడని, చికిత్స అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన ఆటగాడిని నిషేదించాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఈ గొడవ జరగడం వల్ల తాను 300 డాలర్లు నష్టపోయినట్లు అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ గొడవపై స్పందించిన ఆక్లాండ్ క్రికెట్ సంఘం.. దాడికి పాల్పడిన ఆటగాడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా, బాధిత క్రికెటర్ పార్ట్ టైమ్ కింద ట్యాక్సీ డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.