ఎంఎస్ ధోని.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టీమిండియాకు రెండుసార్లు ఐసీసీ వరల్డ్‌కప్‌లు అందించిన ధోనికి అభిమాన గణం కూడా ఎక్కువే. ధోని నడిచినా, నవ్వినా, బ్యాటింగ్ చేసినా అతడి మైకంలో మునిగితేలిన అభిమానులు ఎందరో ఉన్నారు. అతడు మైదానంలోకి దిగుతున్నాడంటేనే ఏదో తెలియని అనుభూతికి లోనయ్యే ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారిపోతుంది.
అచ్చం అలాంటి సంఘటనే చెపాక్ స్టేడియంలో మరోసారి జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సీఎస్‌కే తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని ఆదివారం అలా చెపాక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయంలోకి వెళితే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలారు. మ్యాచ్ జరగనప్పటికీ చెపాక్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.
దీనికి ప్రధాన కారణం ధోనినే అన్న సంగతి తర్వాతి క్షణంలోనే తెలిసొచ్చింది. సీఎస్‌కే ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో మునిగిన సమయంలో ధోని అలా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్ మధ్యలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రేక్షకులంతా లేచి నిలబడి ‘ధోని.. ధోని.. ధోని’.. ‘తలా.. తలా’ అంటూ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది.
ఇదే సమయంలో కొంతమంది అభిమానులు ధోనిని చూసి ఎమోషన్‌ను అదుపు చేసుకోలేక కన్నీటిపర్యంతమవ్వడం కనిపించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలలికినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ధోనిని చూడగానే అభిమానుల్లో దుఃఖం బయటికి రావడానికి ‘ధోనికి బహుశా ఇదే చివరి సీజన్’ అనే కారణం కూడా ఉండొచ్చు.
కొంతకాలంగా ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్‌కే యాజమాన్యం తన ‘ఎక్స్’లో షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. ఇక 2023లో విజేతగా నిలిచిన సీఎస్‌కే ఈ సీజన్‌లో మరోసారి టైటిల్ సాధించి ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈసారి సీఎస్‌కేకు సంజూ శాంసన్ రాకతో జట్టుకు అదనపు బలం చేకూరినట్లయింది. ఇక ఐపీఎల్ 19వ సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
Thala Dharisanam 🦁#Roar26 #WhistlePodu pic.twitter.com/RST5EpXKct
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026


