రుతురాజ్‌ మెరిసె.. సీఎస్‌కే మురిసె | CSK Beat RCB By 8 Wickets | Sakshi
Sakshi News home page

రుతురాజ్‌ మెరిసె.. సీఎస్‌కే మురిసె

Published Sun, Oct 25 2020 6:46 PM | Last Updated on Sun, Oct 25 2020 8:28 PM

CSK Beat RCB By 8 Wickets - Sakshi

దుబాయ్‌: వరుస ఓటములతో ఢీలా పడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎట్టకేలకు మరో విజయాన్ని సాధించింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.  రుతురాజ్‌ గైక్వాడ్‌  51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు సాధించి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌లో భాగంగా సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌లు ఆరంభించారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌ ధాటిగా ప్రారంభించాడు. కాగా,  13 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లతో 25 పరుగులు చేసిన తర్వాత డుప్లెసిస్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

మోరిస్‌ వేసిన ఆరో ఓవర్‌ తొలి బంతికి షాట్‌ ఆడిన డుప్లెసిస్‌.. సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో రుతురాజ్‌కు అంబటి రాయుడు జత కలిశాడు. రాయుడు తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.  27 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్స్‌లతో 39 పరుగులు సాధించిన రాయుడు రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.చహల్‌ వేసిన 14 ఓవర్‌ మూడో బంతికి రాయుడు బౌల్డ్‌ అయ్యాడు. వీరిద్దరూ 67 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత రాయుడు ఔట్‌ కాగా, ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. రుతురాజ్‌-ధోనిలు మరో వికెట్‌ పడకుండా బాధ్యతాయుతంగా ఆడటంతో సీఎస్‌కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది. ధోని  21 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు. ఇది సీఎస్‌కేకు నాల్గో విజయం కాగా, ఆర్సీబీకి నాల్గో ఓటమి.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ధాటి ఆరంభించారు. అయితే ఆర్సీబీ స్కోరు 31 పరుగుల వద్ద ఉండగా ఫించ్‌(15; 11 బంతుల్లో 3ఫోర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి పడిక్కల్‌(22; 21 బంతుల్లో 2 ఫోర్లు ,1 సిక్స్‌) రెండో వికెట్‌గా చేరడంతో ఆర్సీబీ 46 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో విరాట్‌ కోహ్లి-ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.ఈ జోడి 82 పరుగులు జత చేసిన తర్వాత డివిలియర్స్‌(39; 36 బంతుల్లో 4ఫోర్లు) ఔటయ్యాడు.

దీపక్‌ చాహర్‌ వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఏబీ ఔటయ్యాడు. అటు తర్వాత మొయిన్‌ అలీ(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. సామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో సాంత్నార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక విరాట్‌ కోహ్లి మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు.  43 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌తో  50 పరుగులు చేశాడు. స్కోరును పెంచే క్రమంలో 19 ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. ఆ ఓవర్‌ సామ్‌ కరాన్‌ వేయగా డుప్లెసిస్‌ క్యాచ్‌ తీసుకున్నాడు.దాంతో కోహ్లి ఇన్నింగ్స్‌ యాభై పరుగుల వద్ద ముగిసింది. సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు సాధించాడు. సాంత్నార్‌కు వికెట్‌ దక్కింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లి సిక్స్‌ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 200వ సిక్సర్‌ను సాధించాడు. రవీంద్ర జడేజా వేసిన 17ఓవర్‌ మూడో బంతిని ముందుకొచ్చిన కోహ్లి సిక్స్‌ సాధించాడు. ఇదొక్క సిక్స్‌ మాత్రమే కోహ్లి ఈ మ్యాచ్‌లో కొట్టాడు. ఫలితంగా ఐపీఎల్‌లో రెండొందల సిక్సర్లు కొట్టిన జాబితాలో కోహ్లి కూడా చేరిపోయాడు. ఐపీఎల్‌లో రెండొందలు, అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన జాబితాలో క్రిస్‌ గేల్‌(335), ఏబీ డివిలియర్స్‌(231), ఎంఎస్‌ ధోని(216), రోహిత్‌ శర్మ(209)లు వరుస స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement