Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విజయంలో సంజూ శాంసన్, ఆయుశ్ మాత్రేలు కీలకపాత్ర పోషించారు. అయితే సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బౌలర్ల వల్లే తమ జట్టు విజయం సాధించిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు సీజన్‌లో తొలి విజయం సాధించడం, సంతోషంతో మాట్లాడేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మేము ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. చెపాక్ స్టేడియంలో మేము ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసినా 200 నుంచి 210 స్కోరు చేయాలని అనుకునేవాళ్లం.
కానీ స్లో పిచ్ కారణంగా ఆ స్కోరు చేయడం కాస్త కష్టంగా అనిపించేంది. గత మ్యాచ్‌లతో పోలిస్తే అన్ని విషయాల్లో మెరుగయ్యాం. ఈరోజు సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు. కానీ ఇవాళ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలుపులో బౌలింగ్ పాత్రే కీలకం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నా.
నిజానికి మా బౌలింగ్ లైనప్‌లో 'ఎక్స్-ఫ్యాక్టర్' బౌలర్ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఎంత ప్రభావవంతంగా ఉండాలి, ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయాలపై మేం చర్చించుకుంటూనే ఉన్నాం. తొలి మూడు మ్యాచ్‌ల్లో మేము విజయానికి చేరువగా వచ్చినప్పటికీ ఒకటి రెండు ఓవర్లలో 20-25 పరుగులు సమర్పించుకోవడం గెలుపును దూరం చేశాయి.
పవర్‌ప్లేలో మేం కొంచెం వెనకంజలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దేశంలో ఈ ప్రాంతం ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఫ్రాంచైజీని అమితంగా ప్రేమిస్తుంటారు.’ అని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.


