ఐపీఎల్–2023 విజేత ఎవరో తేలేందుకు మరో రోజు వేచి చూడాల్సిందే. ఫైనల్ కోసం మైదానంలో లక్షకు పైగా ఉన్న అభిమాన సందోహం సరిపోదన్నట్లుగా నేనూ ఉన్నానంటూ వరుణ దేవుడు వచ్చేయడంతో అంతా మారిపోయింది. టాస్ సమయానికి అరగంట ముందు మొదలైన వాన నిరంతరాయంగా కురవడంతో ఆటకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది.
ఎంత ఎదురు చూసినా వర్షం తెరిపినివ్వలేదు. దాంతో ఆదివారం జరగాల్సిన తుది పోరును సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్ డే అయిన నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కోసం తలపడతాయి. అన్నట్లు సోమవారం కూడా 10 శాతం వర్ష సూచన ఉంది. అయితే ఏమాత్రం వర్షసూచన లేని ఆదివారమే ఇలా జరిగితే సోమవారం ఏం జరుగుతుందనేది ఆసక్తికరం!
అహ్మదాబాద్: ఐపీఎల్ తాజా సీజన్‌లో మొత్తం 73 మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్ వర్షం బారిన పడి రద్దు కాగా, మరో మ్యాచ్‌లో వర్షం ఆటంకం కలిగించినా ఒక్క బంతి కూడా వృథా కాలేదు. కానీ అసలైన అంతిమ సమరం సమయానికి మాత్రం వరుణుడు పూర్తి ప్రతాపం చూపించాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫైనల్ పోరుకు అడ్డుగా నిలిచాడు.
మండు వేసవిలో అహ్మదాబాద్‌లో వర్షం అంటే అలా కొద్దిసేపు వచ్చి పోయే చినుకుల్లా అందరూ భావించినా ఆదివారం మాత్రం అలా జరగలేదు. చివరకు ఫైనల్ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. సాయంత్రం 6.30 సమయంలో స్వల్పంగా వాన మొదలైంది. ఆ తర్వాతి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. కవర్లు కప్పడం, తొలగించడం మళ్లీ మళ్లీ జరిగాయి.
9 గంటల సమయంలో మాత్రం వాన పూర్తిగా తగ్గిపోయింది. దాంతో అంపైర్లతో పాటు ఇరుజట్ల ఆటగాళ్లు, కోచ్‌లు మైదానంలోకి వచ్చారు. అంతా పిచ్‌ను, అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించడంతో పాటు వామప్ కూడా మొదలైంది. అయితే ఒక్కసారిగా వాన జోరందుకోవడంతో అంతా పరుగెడుతూ గ్రౌండ్ వీడారు. ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు వేచి చూసినా ఫలితం కనిపించలేదు. రాత్రి 9.30కి ఆట ఆరంభమైతే పూర్తి ఓవర్లు సాగేవి.
ఆపై ఓవర్ల కోతతోనైనా మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ప్రయత్నించారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలన్నా అర్ధరాత్రి 12.06కు ఆట ఆరంభం కావాలి. దానికి కనీసం గంట ముందుగా వాన ఆగిపోవాలి. అయితే అనుకున్న సమయానికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఇరు జట్ల కోచ్‌లు స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆశిష్ నెహ్రాల ‘షేక్ హ్యాండ్’తో అధికారికంగా ఖాయమైంది.
నేడు వాన కురిస్తే...
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలాగైనా ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment