pic credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న (ఏప్రిల్ 17) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విధితమే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీగా విధ్వంసం సృష్టించి పరుగుల వరద పారించారు. సీఎస్‌కే తరఫున డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోగా.. ఆర్సీబీ ఆటగాళ్లు డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. అయితే అంతిమంగా సీఎస్‌కేనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. ఆర్సీబీ 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమైంది.
కాగా, భారీ లక్ష్య ఛేదనలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, సీఎస్‌కేకు ముచ్చెమటలు పట్టించిన ఆర్సీబీపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆరంభంలోనే కోహ్లి వికెట్ కోల్పోయినా డెప్లెసిస్, మ్యాక్సీ చూపించిన తెగువకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫ్రాంచైజీ ఈ ఫ్రాంచైజీ అన్న తేడా లేకుండా అన్ని జట్ల అభిమానులు డుప్లెసిస్, మ్యాక్సీ బ్యాటింగ్ విన్యాసాలను కొనియాడుతున్నారు. మరో ఓవర్ పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉండి వుంటే సీఎస్‌కేకు సీన్ సితార అయ్యేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ధోని సైతం అంగీకరించాడు.
వాస్తవానికి మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ఔటయ్యే సమయానికి ఆర్సీబీ పటిష్టమైన స్థితిలో ఉండింది.14 ఓవర్లలో ఆ జట్టు 159 పరుగులు చేసింది. ఆర్సీబీ గెలవాలంటే 36 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉండింది. మ్యాక్సీ, డుప్లెసిస్ ఔటయ్యాక వచ్చిన షాబాజ్ అహ్మద్ (12), దినేశ్ కార్తీక్ (28), సుయాశ్ ప్రభుదేశాయ్ (19) కూడా తమ శక్తి మేరకు పోరాడినప్పటికీ, ఆఖర్లో వేన్ పార్నెల్ (5 బంతుల్లో 2), హసరంగ (2 బంతుల్లో 2 నాటౌట్) దారుణంగా నిరాశపరిచారు.
ఆఖరి ఓవర్‌లో గెలుపుకు 19 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ కేవలం 10 పరుగులు మాత్రమే సాధించడంతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైనప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినందుకు గాను అభిమానుల మన్ననలు అందుకుంది. ముఖ్యంగా డుప్లెసిస్, మ్యాక్సీ చూపించిన తెగువను ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కొండంత లక్ష్యంగా ఎదురుగా ఉన్న ఏమాత్రం వెరవకుండా వారిద్దరు ప్రదర్శించిన తెగువకు ఫ్యాన్స్ సలాం కొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment