టీమిండియాతో నిన్న (అక్టోబర్ 19) జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
మిడిలార్డర్ వైఫల్యం..
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు శుభారంభమే లభించినప్పటికీ, మిడిలార్డర్ విఫలం కావడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. మిడిలార్డర్ ఆటగాళ్లు షాంటో (8), మెహిది హసన్ (3), తౌహిద్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో ముష్ఫికర్ రహీం (38), మహ్మదుల్లా (46) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
మ్యాచ్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు ఆ తర్వాత పుంజుకుని బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. బుమ్రా, సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలేకపోయారు. గిల్ (53), రోహిత్ (48) మెరుపు ఇన్నింగ్స్‌లతో శుభారంభాన్ని అందించగా.. కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డేల్లో 48వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రేయస్ (19) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. రాహుల్ (34 నాటౌట్) సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 2, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో స్పందిస్తూ..
టీమిండియాకు శుభాకాంక్షలు. ఎప్పటిలాగే వారు ఈ మ్యాచ్‌లోనూ మాపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. టీమిండియా సామర్థ్యం గురించి మాకు తెలుసు. వారు ఏంటో మరోసారి నిరూపించారు. ఇవాళ మేము అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. లిటన్, తంజిద్ శుభారంభాన్ని అందించారు. మిడిలార్డర్ వైఫల్యమే మా కొంపముంచింది.
మా బౌలర్లు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. అయితే చేయాల్సినన్ని పరుగులు చేయలేకపోవడంతో టీమిండియాను నిలువరించలేకపోయాం. లిటన్ కాసేపు క్రీజ్‌లో ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మొత్తంగా ఈ ఓటమికి మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యమే కారణమని చెప్పాలి. టోర్నీలో తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం.
షకీబ్ గాయంపై ఏమన్నాడంటే..
షకీబ్ బాగానే ఉన్నాడు. అతని గాయం అంత పెద్దదేమీ కాదు. అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment