గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు (PC: BCCI)
ICC ODI WC 2023: ‘‘ఒక గొప్ప ఉత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో దానికి పూర్తిగా ముగింపు పలకాలనే వార్తలు కూడా వినిపిస్తుండటం దురదృష్టకరం. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇస్తూ గొప్ప ఘనతల గురించి చెప్పి భావోద్వేగాలకు గురి చేసి ఇక మీ సమయం ముగిసిందని చెప్పడం ఎలాగో ఇదీ అలాగే ఉంది.
50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇదే చివరి ప్రపంచకప్ అంటూ కొందరు చేతకాని, దూరదృష్టి లేని, బద్ధకస్తులైన క్రికెట్ పరిపాలకులు అంటున్నారు. నాకు తెలిసి అన్ని మార్పుల్లాగే ఈతరం వారి కోసం వన్డేలకు కూడా కొన్ని మార్పులతో హంగులు అద్దడం అవసరం. టి20ల్లో ఒక్కసారి దెబ్బ పడితే కోలుకునే అవకాశం ఉండదు.
మళ్లీ ప్రతీకారం తీర్చుకోవచ్చు
కానీ వన్డేల్లో అలా కాదు. ఒక బౌలర్ ఆరంభంలో భారీగా పరుగులిచ్చినా చివర్లో మళ్లీ ప్రతీకారం తీర్చుకోవచ్చు. వన్డేల్లో కెప్టెన్లు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఈ వరల్డ్‌కప్‌లో మనం చూడబోతున్నాం’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు.
వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ టోర్నీకి ముగింపు అంటూ అభిప్రాయపడటం మూర్ఖత్వమే అని విమర్శించాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ వన్డే వరల్డ్‌కప్ ప్రాముఖ్యత, టీమిండియా గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
సిరాజ్, బుమ్రా సూపర్
ఈ మేరకు.. ‘‘గిల్, సిరాజ్, శ్రేయస్‌లాంటి వారిని అభిమానులకు మరింత చేరువ చేయాల్సి ఉంది. బౌలర్లు బాగా ప్రభావం చూపించడాన్ని మనం గుర్తించాలి. ఇటీవల ఆసియా కప్‌లో సిరాజ్, బుమ్రా కలిసి శ్రీలంకను 50 పరుగులకు కుప్పకూల్చడం చూసి చాలా సంతోషం వేసింది.
అలాంటి అద్భుత బౌలింగ్‌నూ చూడాలని అభిమానులు అనుకుంటారు. ఈ తరహాలో బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉంచేందుకు వరల్డ్ కప్ నిర్వాహకులకు ఇదే సరైన అవకాశం.
భారత జట్టు బాగా ఆడటం కూడా దీనికి మేలు చేస్తుంది. నా దృష్టిలో టైటిల్ గెలిచేందుకు భారత్, ఇంగ్లండ్‌లకు మంచి అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉన్నప్పుడు బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడనేది ఆసక్తికరం’’ అని గంభీర్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వరల్డ్ కప్ జరిగే ఇతర నగరాల్లోనూ ఇలాగే ఉండటం మంచి విషయం.
ఆటను ఆస్వాదిస్తూ.. పర్యావరణ హితంగా
ప్రపంచకప్ జరిగే సమయంలోనే దసరా, దీపావళి వస్తున్నాయి. ఆ సమయంలో బాణసంచా కాల్చకుండా వన్డే క్రికెట్‌లో బంతి, బ్యాట్ శబ్దాలు వినగలిగితే చాలు’’ అంటూ ఆటను ఆస్వాదిస్తూనే పర్యావరణ హితాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అభిమానులకు సూచించాడు. కాగా గంభీర్ 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో గౌతం గంభీర్ కీలక సభ్యుడన్న విషయం తెలిసిందే.
చదవండి: ఇంగ్లండ్- న్యూజిలాండ్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..?
Comments
Please login to add a commentAdd a comment