
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్-బిలో శ్రీలంకకు ధీటుగా చిన్న జట్టు స్కాట్లాండ్ వరుస విజయాలు సాధిస్తుంది. ఇవాళ (జూన్ 25) ఒమన్‌పై విజయం సాధించడంతో ఆ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తద్వారా గ్రూప్-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది.
ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్కాట్లాండ్ చేతిలో ఓడినా ఒమన్ ఈ గ్రూప్ నుంచి మూడో జట్టుగా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్-బిలో మరో జట్టైన యూఏఈ 3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు సూపర్ సిక్స్ దశకు చేరగా.. నేపాల్, యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఫలితంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు.
321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఏ దశలోనూ విజయం సాధించేట్టు కనపడలేదు. ఆ జట్టు తొలి 6 వికెట్లు క్రమ అంతరాల్లో పోగొట్టుకుంది. అయితే వికెట్ కీపర్ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖర్లో స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ చెలరేగి 5 వికెట్లు పడగొట్టడంతో ఒమన్ కథ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది.