వరల్డ్‌కప్-2023 రేసు నుంచి వెస్టిండీస్ అవుట్
ICC Cricket World Cup Qualifiers 2023- Scotland Beat West Indies by 7 wkts: ‘‘ఆది నుంచే మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని తెలుసు. నిజానికి ఈ మ్యాచ్‌లో మేము టాస్ గెలిస్తే బాగుండేది. ఇలాంటి పిచ్ మీద ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకుంటాడు.
ఆ విషయంలో మాకేదీ కలిసిరాలేదు. క్యాచ్‌లు వదిలేయడాలు, మిస్‌ఫీల్డింగ్ తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆటలో ఇవన్నీ సహజమే! కానీ ప్రతిసారీ వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టలేము కదా! ఆటలో ఇవన్నీ సహజమే!
వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందే.. స్వదేశంలోనే మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సింది. సరైన సన్నాహకాలు లేకుండా నేరుగా వెళ్లి గొప్పగా ఆడాలంటే అన్నివేళలా కుదరకపోవచ్చు.
గెలవాలనే పట్టుదల, కసి
మిగిలిన మ్యాచ్‌లలో గెలిచైనా మా అభిమానులకు కాస్త వినోదం పంచుతాం. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ నిలకడగా ఆడలేకపోవడమే మా కొంపముంచింది. స్కాట్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా వాళ్ల బౌలర్లు మెరుగ్గా రాణించారు.
గెలవాలనే పట్టుదల, కసి వారిలో కనిపించాయి. మేము వాళ్లను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. తిరిగి వెళ్లిన తర్వాత డారెన్ సామీతో కలిసి మా జట్టులోని లోపాలను సరిచేసుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు.
స్కాట్లాండ్ చేతిలో ఓడి
రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ జట్టు వన్డే వరల్డ్‌కప్-2023లో క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. జింబాబ్వేలో జరిగిన సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వరల్డ్‌కప్ రేసు నుంచి అవుట్
తద్వారా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2023లో అడుగుపెట్టే అర్హత కోల్పోయింది. మాజీ చాంపియన్ ఇలా అవమానకరరీతిలో నిష్క్రమించడం అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తోంది.
మా ఓటమికి ప్రధాన కారణం అదే
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విండీస్ సారథి షాయీ హోప్ మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. హరారేలో శనివారం నాటి మ్యాచ్‌లో తాము తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పరోక్షంగా టాస్ ఓడటమే కారణమని అభిప్రాయపడ్డాడు.
అదే సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించిన హోప్.. తమ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. టోర్నీ మొత్తం తమకు నిరాశనే మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా సూపర్ సిక్సెస్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
జూలై 5న ఒమన్, జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ తలపడాల్సి ఉంది. ఈ రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో గెలిచైనా గౌరవప్రదంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కరేబియన్ జట్టు భావిస్తోంది.
స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు:
టాస్: స్కాట్లాండ్- బౌలింగ్
వెస్టిండీస్- 181 (43.5)
స్కాట్లాండ్- 185/3 (43.3)
విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్‌ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు).
చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే!
పసికూన చేతిలో చిత్తు! వరల్డ్‌కప్ నుంచి అధికారికంగా అవుట్
Comments
Please login to add a commentAdd a comment