‘బౌల‌ర్ల వైఫ‌ల్యం మా కొంపముంచింది’ | SRH Coach Daniel Vettori Reveals Reason Behind SRH Defeat Vs RCB At IPL 2026 Opener, Read Story For More Details | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘బౌల‌ర్ల వైఫ‌ల్యం మా కొంపముంచింది’

Mar 29 2026 11:49 AM | Updated on Mar 29 2026 12:55 PM

Daniel Vettori Reveals Reason Behind SRH Defeat Vs RCB At-IPL 2026

బౌల‌ర్ల పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగానే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓట‌మి చవి చూసిన‌ట్లు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) కోచ్ డానియెల్ వెటోరి అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ప‌డిక్క‌ల్‌, కోహ్లీ, ప‌టిదార్‌లు త‌మ బౌలింగ్ బ‌ల‌హీన‌త‌ను ఆస‌రాగా చేసుకొని ప‌రుగులు రాబ‌ట్టార‌ని పేర్కొన్నాడు. 

మ్యాచ్ ఓట‌మి అనంత‌రం వెటోరి మాట్లాడుతూ.. ‘నిజానికి బంతితో మాకు మంచి ఆరంభమే లభించింది. ప్రమాదకర ఫిల్ సాల్ట్‌ను తొందరగానే పెవిలియన్ చేర్చడంలో సఫలమయ్యాం. కానీ ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించలేకపోయాం. సాల్ట్ ఔటైన తర్వాత క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అదే సమయంలో ప్రత్యర్థి జట్టులో జాకబ్ డఫీ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసి ఫలితం రాబట్టాడు. కానీ మా బౌలర్లు ఆ స్థాయి బౌలింగ్ చేయడంలో విఫలమయ్యారు. 

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ నుంచే గెలవాలని అన్ని జట్లకు ఉంటుంది. ఆరంభం ఘనంగా ఉంటే ఆ తర్వాత అంతా మెరుగ్గా ఉంటుందని నా నమ్మకం. ఆర్‌సీబీ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శించి మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. మా బౌలింగ్ పూర్తిగా గాడి తప్పింది. విరాట్ కోహ్లీకి, పడిక్కల్‌కు మా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 

ఇది మా రోజు కాదు. రాబోయే మ్యాచ్‌ల్లో బౌలింగ్‌లో తప్పుల్ని సరిదిద్దుకొని మెరుగైన ప్రదర్శన చేస్తాం. డేవిడ్ పైన్‌, హర్ష్ దూబే వంటి బౌలర్లు రాబోయే మ్యాచ్‌ల్లో కీలకం కానున్నారు. మేము 200 పరుగులు చేసినప్పటికీ చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై ఆ స్కోరు ఏమాత్రం సరిపోదని తాజా మ్యాచ్ ద్వారా స్పష్టమవుతోంది.

ఇషాన్ కిషన్, క్లాసెన్ మినహా మిగతావారు రాణించకపోవడం కూడా ఒక కారణమే. అయితే మా ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే ఔటవడం కూడా ప్రభావం చూపించింది. బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు లేవు. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటాం’ అని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 203 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జాకబ్ డఫీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ గెలుచుకున్నాడు.

చదవండి: కావ్యా మారన్‌కు అనన్య చెక్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement