David Warner To Attend Warne Funeral: ఇటీవల కన్నుమూసిన స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ బౌలర్ షేన్ వార్న్ అంత్యక్రియలకు తప్పక హాజరు కావాలని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వార్నర్.. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే తన అభిమాన క్రికెటర్ తుది వీడ్కోలు కార్యక్రమానికి హాజరవుతానని వెల్లడించాడు. పాక్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఈనెల 25తో ముగియనుండగా, వార్న్ అంతిమ సంస్కారాలు ఈనెల 30న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్నాయి.
ఇదిలా ఉంటే, వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయం అతని ఐపీఎల్ జట్టైన ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఈనెల 26 నుంచి ప్రారంభంకానుండగా, వార్నర్ తాజా నిర్ణయంతో డీసీ జట్టు పలు మ్యాచ్‌లకు అతని సేవలు కోల్పోనుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం వార్నర్.. ఈ తేదీలో పాక్ పర్యటనలోనే ఉండాలి. అయితే, ఏప్రిల్ 6 వరకు సాగే ఈ పర్యటనలో వన్డే సిరీస్ (3 వన్డేలు)తో పాటు ఏకైక టీ20లో పాల్గొనని వార్నర్ ముందుగానే ప్రకటించాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు మిస్ కాకూడదనే ఉద్దేశంతో వార్నర్ ఇదివరకే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు.
మరోవైపు పాక్ పర్యటన కారణంగా పలువురు ఆసీస్ ఆటగాళ్లు.. ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6తో పాక్ సిరీస్ ముగిసినప్పటికీ, భారత్‌లో క్వారంటైన్ నిబంధనల కారణంగా వారు మరో వారం రోజులపాటు బెంచ్‌కే పరిమితమవుతారు. ఈలోపు లీగ్‌లో దాదాపు 25 మ్యాచ్‌లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఆయా ఫ్రాంచైజీలు గగ్గోలు పెడుతున్నాయి. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ జట్టు వార్నర్‌ను రూ. 6.5 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: భారత జట్టు నుంచి ఔట్.. ఇంగ్లండ్‌లో ఆడనున్న పుజారా!
Comments
Please login to add a commentAdd a comment