టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా తన తల్లి ఆనారోగ్యం బారిన పడటటంతో మూడో టెస్టుకు ముందు ఉన్నపళంగా కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి ఆరోగ్యం కుదటపడకపోవడంతో కమ్మిన్స్ అక్కడే ఉండిపోయాడు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు అతడు దూరమయ్యాడు.
అయితే కమ్మిన్స్ మరి కొన్ని రోజులు తల్లి దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్‌తో పాటు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఇక వార్నర్ విషయానికి వస్తే.. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో అతడి మోచేయికి గాయమైంది.
దీంతో అతడు వెంటనే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇక వార్నర్ తన చేతి గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో అతడు కూడా టీమిండియాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్ స్టార్ పేసర్ జో రిచర్డ్‌సన్ కూడా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. మార్చి 17న ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఒక వేళ కమ్మిన్స్ వన్డే సిరీస్‌కు దూరమైతే.. ఆసీస్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment