
కొలంబో: బౌలర్ దీపక్ చహర్ అసమాన బ్యాటింగ్‌తో రెండో వన్డేలో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. రెండు రోజుల విరామం అనంతరం శ్రీలంకతో సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేకు శిఖర్ ధావన్ బృందం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ యోచిస్తోంది. మరోవైపు ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక పట్టుదలగా ఉంది.
మార్పులు ఉంటాయా!
ఇప్పటికే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో చివరి వన్డేలో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా జరిగితే టీమిండియాలో పలు మార్పులు చోటు చేసుకోవచ్చు. పృథ్వీ షా స్థానంలో మరో యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ సామ్సన్ కూడా తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిరీస్‌లో విశేషంగా రాణిస్తో న్న స్పిన్ ద్వయం కుల్దీప్, చహల్‌లకు విశ్రాంతి ఇచ్చి రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్‌లను ఆడించొచ్చు. అంతేకాకుండా భారత్ తన లోపాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. రెండో వన్డేలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా... సూర్య కుమార్, మనీశ్ పాండేలు జట్టును ఆదుకున్నారు.
చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ ఆడకుండా ఉంటే భారత్‌కు ఓటమి తప్పేదికాదు. వీటితో పాటు డెత్ ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుం టున్నారు. ఈ సమస్యలను అధిగమిస్తే మూడో వన్డేలో భారత్‌కు విజయం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు రెండో వన్డేలో అంచనాలకు మించి ఆడిన లంకేయులు ఒక దశలో మ్యాచ్‌ను గెలిచేలా కనిపించారు. దీపక్, భువనేశ్వర్‌ల భాగస్వామ్యం ఆ జట్టుకు గెలుపును దూరం చేసింది. ఈ సిరీస్ ద్వారా శ్రీలంక జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని తేలింది. వీరు అనుభవం గడిస్తే శ్రీలంక జట్టు మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, అసలంక, కెప్టెన్ దసున్ షనక, కరుణరత్నే, హసరంగ ఈ సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్నారు. వీరందరూ చివరి వన్డేలోనూ ఆడితే భారత్‌కు శ్రీలంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.
శ్రీలంక జట్టుకు జరిమానా
రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. అంతేకాకుండా ఈ సిరీస్ ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగం కావడంతో శ్రీలంక జట్టుకు ఒక పాయింట్ కోత విధించారు. ఆర్టికల్ 16.12.2 ప్రకారం నిర్ణీత సమయంలోపు ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఓవర్‌కు పాయింట్ చొప్పున కోత విధిస్తారు.