ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
400 మీటర్లలో విశ్వ విజేతగా తెలంగాణ అమ్మాయి
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి.
పేదరికం నుంచి పైకెగసి...
పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్‌లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి
ఆరి్థకంగా సహకారం
అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్‌లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్‌లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment