
సుదీర్ఘ టి20 కెరీర్‌లో పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ‘గబ్బర్’ అలియాస్ శిఖర్ ధావన్‌కు సెంచరీ లేని లోటు మాత్రం ఇప్పటి వరకు ఉండేది. అయితే ఇప్పుడు తొలి శతకాన్ని సాధించి ఆ కోరికను కూడా తీర్చుకున్నాడు. అదీ సరైన సమయంలో, జట్టుకు అవసరమైన సందర్భంలో సాధించడం దానిని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఛేదనలో సహచరులంతా విఫలమైన వేళ, తనొక్కడే శిఖరంలా చివరి వరకు నిలిచి బౌండరీల వర్షం కురిపించిన ధావన్ ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచ్‌లలో అర్ధ సెంచరీ చేసిన అతను తన ప్రదర్శనకు మరింత దూకుడు జత చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. క్యాపిటల్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనడంలో ఇబ్బందిపడి సాధారణ స్కోరుకే పరిమితమైన సూపర్ కింగ్స్ బౌలింగ్‌లోనూ సత్తా చాటలేక పరాజయాన్ని కొనితెచ్చుకుంది.
షార్జా: ఐపీఎల్‌లో తమ జోరును కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డుప్లెసిస్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... అంబటి తిరుపతి రాయుడు (25 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), షేన్ వాట్సన్ (28 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు సాధించి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (58 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించగా... చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (5 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్‌లు) అదరగొట్టాడు.
డుప్లెసిస్ అర్ధ సెంచరీ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. తుషార్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌లో మూడో బంతికే స్యామ్ కరన్ (0) అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్, వాట్సన్ భాగస్వామ్యం జట్టును ముందుకు నడిపించింది. నోర్జే ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో ప్లెసిస్ దూకుడు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ ఓవర్లో వీరిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో చెన్నై 85 పరుగులు చేయగలిగింది. తుషార్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన డుప్లెసిస్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా 15 ఓవర్లలో స్కోరు 112 పరుగుల వద్ద నిలిచింది. రెండో వికెట్‌కు ప్లెసిస్, వాట్సన్ 67 బంతుల్లో 87 పరుగులు జోడించారు.
మెరుపు బ్యాటింగ్...
ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లు సూపర్ కింగ్స్‌కు బాగా కలిసొచ్చాయి. ధోని (3) మళ్లీ విఫలమైనా... రాయుడు, జడేజా జోడి ఒకరితో మరొకరు పోటీపడి చెలరేగారు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి జడేజా 4 సిక్సర్లు, రాయుడు 3 సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో మొత్తం 67 రావడం విశేషం. నోర్జే వేసిన చివరి ఓవర్లో జడేజా కొట్టిన రెండు వరుస సిక్స్‌లు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. బౌలర్ చావ్లా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జాదవ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.
అతనొక్కడే...
విజయతీరం చేరే వరకు ఢిల్లీ ఇన్నింగ్స్ మొత్తం ధావన్ చుట్టూనే సాగింది. రెండో బంతికే పృథ్వీ షా (0) అవుట్ కాగా, రహానే (8) కూడా విఫలమయ్యాక ధావన్ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో కొట్టిన ఒక్క సిక్సర్ మినహా అతను ఫోర్ల ద్వారానే తన జోరును ప్రదర్శించాడు. స్యామ్ కరన్, జడేజా, కరణ్ శర్మ... ఇలా ఏ బౌలర్‌నూ వదలకుండా ఒక్కో ఓవర్లో రెండేసి ఫోర్లు కొడుతూ సాగిపోయిన ధావన్ 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్), స్టొయినిస్ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) కొంత సహకరించినా...మొత్తంగా మ్యాచ్‌లో ధావన్ షోనే కనిపించింది. వ్యక్తిగత స్కోర్లు 25, 50, 79 వద్ద ధావన్ ఇచ్చిన క్యాచ్‌లు చెన్నై వదిలేయడం కూడా అతనికి కలిసొచ్చింది.
కొంత ఉత్కంఠ...
చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 21 పరుగులు కావాల్సి ఉండగా... 19వ ఓవర్లో స్యామ్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి క్యారీ (4)ని అవుట్ చేశాడు. 99 పరుగుల స్కోరు వద్ద ధావన్ కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేసిన ధోని రివ్యూకు కూడా వెళ్లాడు. అయితే రీప్లేలో అది నాటౌట్‌గా తేలింది. తర్వాతి బంతికి సింగిల్ తీసిన శిఖర్ ఐపీఎల్‌లోనే కాకుండా తన టి20 కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు. జడేజా వేసిన చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ మూడు సిక్సర్లు బాది క్యాపిటల్స్‌కు గెలుపును ఖాయం చేశాడు.
జడేజా ఎందుకంటే...
సాధారణంగా చెన్నై బౌలర్లలో డెత్ ఓవర్లలో, ప్రత్యర్థి ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా సరే చివరి ఓవర్‌ను బ్రేవో బౌలింగ్ చేయడం పరిపాటి. ఐపీఎల్‌లో ఇది చాలా సార్లు కనిపించింది. అయితే ఈసారి స్పిన్నర్ జడేజా వేయడం ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ తర్వాత ధోని దీనిపై స్పష్టతనిచ్చాడు. ఫిట్‌గా లేని బ్రేవో మైదానం బయటే ఉండిపోవడం అందుకు కారణమని వెల్లడించాడు. మిగిలిన బౌలర్లలో కరణ్ శర్మ, జడేజా మాత్రమే ప్రత్యామ్నాయం. కరణ్‌కంటే జడేజా అనుభవాన్ని ధోని నమ్మాడు.
నిజానికి క్రీజ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉన్నప్పుడు లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను చితక్కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ బౌలర్‌ను కెప్టెన్‌ను ఉపయోగించరు. చివరి ఓవర్‌కు ముందు వరకు జడేజా ఒకే ఒక ఓవర్ వేయడానికి కూడా ధావన్ క్రీజ్‌లో ఉండటమే కారణం. అయితే చివరకు అలా చేయాల్సి వచ్చి జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ చేతిలోనే చావుదెబ్బ తిన్నాడు. అయితే అది శిఖర్ కాకుండా స్వయంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ కావడం విశేషం.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) నోర్జే (బి) తుషార్ 0; డుప్లెసిస్ (సి) ధావన్ (బి) రబడ 58; వాట్సన్ (బి) నోర్జే 36; రాయుడు (నాటౌట్) 45; ధోని (సి) క్యారీ (బి) నోర్జే 3; జడేజా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179
వికెట్ల పతనం: 1–0; 2–87; 3–109; 4–129.
బౌలింగ్: తుషార్ 4–0–39–1; రబడ 4–1–33–1; అక్షర్ 4–0–23–0; నోర్జే 4–0–44–2; అశ్విన్ 3–0–30–0; స్టొయినిస్ 1–0–10–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి అండ్ బి) చహర్ 0; ధావన్ (నాటౌట్) 101; రహానే (సి) స్యామ్ కరన్ (బి) చహర్ 8; అయ్యర్ (సి) డుప్లెసిస్ (బి) బ్రేవో 23; స్టొయినిస్ (సి) రాయుడు (బి) శార్దుల్ 24; క్యారీ (సి) డుప్లెసిస్ (బి) స్యామ్ కరన్ 4; అక్షర్ పటేల్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 185.
వికెట్ల పతనం: 1–0; 2–26; 3–94; 4–159; 5–159.
బౌలింగ్: దీపక్ చహర్ 4–1–18–2; స్యామ్ కరన్ 4–0–35–1; శార్దుల్ 4–0–39–1; జడేజా 1.5–0–35–0; కరణ్ శర్మ 3–0–34–0; బ్రేవో 3–0–23–1.
► ఐపీఎల్ టోర్నీలోనే కాకుండా తన టి20 కెరీర్‌లోనే శిఖర్ ధావన్‌కిది తొలి సెంచరీ కావడం విశేషం. తన 265వ ఇన్నింగ్స్‌లో ధావన్ సెంచరీ సాధించాడు.
► ఈ సీజన్‌లో ఢిల్లీ గెలిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు భించాయి.
► ఈ ఐపీఎల్ సీజన్‌లో నమోదైన సెంచరీల సంఖ్య. ధావన్‌కంటే ముందు మయాంక్, రాహుల్ ఒక్కో శతకం కొట్టారు.
► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మన్ సెంచరీ చేయడం ఇది తొమ్మిదోసారి.
Comments
Please login to add a commentAdd a comment