ఢిల్లీ సిక్సర్‌... | Delhi Capitals beat Rajasthan Royals by 13 Runs | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సిక్సర్‌...

Published Thu, Oct 15 2020 4:53 AM | Last Updated on Thu, Oct 15 2020 5:16 AM

Delhi Capitals beat Rajasthan Royals by 13 Runs - Sakshi

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మరో విజయం సాధించింది. బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది. లీగ్‌లో ఢిల్లీకిది ఆరో విజయం కాగా... రాయల్స్‌ ఐదో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ధావన్‌ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాణించారు. అర్చర్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేసి ఓడింది. స్టోక్స్‌ (35 బంతుల్లో 41; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. నోర్జే, తుషార్‌ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీశారు. నోర్జేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

ధావన్‌ దంచేశాడు...
‘సున్నా’కే పృథ్వీ షా అవుటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ మొదలైన తొలి బంతికే అర్చర్‌ అతన్ని పెవిలియన్‌కు పంపాడు. అనుభవజ్ఞుడైన రహానే (2) కూడా ఆర్చర్‌ స్వింగ్‌కు తలవంచాడు. ఈ దశలో ధావన్‌ దూకుడు పెంచాడు. రెండో ఓవర్లోనే బౌండరీ కొట్టిన ఈ ఎడంచేతి బ్యాట్స్‌మన్‌... త్యాగి నాలుగో ఓవర్లో షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. ఇదే ఊపుతో తర్వాతి రెండు ఓవర్లలోనూ ధావన్, కెప్టెన్‌ అయ్యర్‌ ఫోర్లు కొట్టడంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో ఢిల్లీ 47/2 స్కోరు చేసింది. తర్వాత స్పిన్నర్లను చూసి ఆడిన వీరిద్దరు బంతుల్ని మాత్రం వృథా చేయకుండా ఒకట్రెండు పరుగులు, అడపాదడపా బౌండరీలు బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి రన్‌రేట్‌ను ఇంచుమించు 8 పరుగులకు పెంచుకుంది. ఆ మరుసటి ఓవర్లోనే ధావన్‌ 30 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత గోపాల్‌ 12వ ఓవర్‌ తొలి బంతిని మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదిన ధావన్‌ అదే ఓవర్లో అవుటయ్యాడు.

అయ్యర్‌ అర్ధ శతకం...
శిఖర్‌ అవుటయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ వేగం పెంచాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఉనాద్కట్‌ వేసిన 16వ ఓవర్లో అతను లాంగాన్, డీప్‌ మిడ్‌వికెట్‌ల మీదుల సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అయ్యర్‌ 40 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 16వ ఓవర్లో అతను అవుటయ్యే సరికి జట్టు స్కోరు 132/4. కానీ మిగిలిన 4 ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. స్టొయినిస్‌ (18), క్యారీ (14)లు మెరిపించకపోవడంతో ఢిల్లీ 24 బంతుల్లో 29 పరుగులే చేయగలిగింది.  

దూకుడుగా మొదలై...
రాజస్తాన్‌ లక్ష్యఛేదన బౌండరీతో మొదలైంది. బట్లర్‌తో ఓపెనింగ్‌ చేసిన స్టోక్స్‌ ఫోర్‌ బాదాడు. బట్లర్‌ కూడా బౌండరీ కొట్టడంతో రబడ తొలి ఓవర్లోనే 10 పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాత తుషార్‌ ఓవర్లో స్టోక్స్‌ 2 ఫోర్లు కొట్టాడు. ఇక మూడో ఓవర్లో అయితే బట్లర్‌ చెలరేగాడు. నోర్జే బౌలింగ్‌లో ఓ సిక్స్, వరుస రెండు ఫోర్లు కొట్టాడు. ఇంకో బంతి మిగిలుండగానే 16 పరుగులొచ్చాయి. కానీ ఆఖరి బంతికి బట్లర్‌ బౌల్డయ్యాడు. 3 ఓవర్లలో 37/1 స్కోరుతో ఉన్న రాయల్స్‌కు తర్వాతి ఓవర్లోనే అశ్విన్‌ పెద్ద షాకిచ్చాడు. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ (1)ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. స్కోరుజోరు ఒక్కసారిగా పడిపోయింది. తర్వాత 3 ఓవర్లలో కేవలం 13 పరుగులే రాగా... 6 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. క్రీజులో కుదురుకున్న సామ్సన్, స్టోక్స్‌ ధాటిగా ఆడటంతో ఏడో ఓవర్‌ నుంచి మళ్లీ పుంజుకుంది. 8.5 రన్‌రేట్‌తో 10 ఓవర్లు ముగిసేసరికి 85/2 స్కోరు చేసింది. కానీ వరుస ఓవర్లలో స్టోక్స్, సామ్సన్‌ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) అవుటవ్వడం రాజస్తాన్‌కు ప్రతికూలమైనా... ఉతప్ప (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రన్‌రేట్‌ పడిపోనివ్వలేదు.  

అశ్విన్‌ కట్టడి...
15 ఓవర్లలో రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోరు 5 వికెట్లకు 123 పరుగులుగా ఉంది. ఆఖరి 5 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన సమీకరణం ఏమంత క్లిష్టమైంది కాదు. పైగా హిట్టర్లు తేవటియా, రాబిన్‌ ఉతప్ప క్రీజులో ఉన్నారు. కానీ స్పిన్నర్‌ అశ్విన్‌ పొదుపైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. 16వ ఓవర్‌లో అతను కేవలం 2 పరుగులే ఇవ్వడం... తర్వాత పేసర్లు నోర్జే, రబడ పట్టుబిగించేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు తగ్గట్లే నోర్జే 17వ ఓవర్లో రాబిన్‌ ఉతప్ప వికెట్‌ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. రబడ కూడా ఆర్చర్‌ (1)ను అవుట్‌ చేసి మూడే పరుగులిచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్‌ సమీకరణం రాజస్తాన్‌కు క్లిష్టమైంది. గెలిపించేందుకు 6 బంతుల్లో 22 పరుగులు చేయడం  తేవటియా (14 నాటౌట్‌) వల్ల కాలేదు. తుషార్‌ దేశ్‌పాండే ఈ ఓవర్లో 8 పరుగులిచ్చి శ్రేయస్‌ గోపాల్‌ (6)ను అవుట్‌ చేశాడు.

నాడు... బౌండరీ వెలుపల!
తుషార్‌ దేశ్‌పాండే ఐపీఎల్‌ పుట్టినపుడే మైదానంలో కాలుపెట్టాడు. కానీ... గీత దాటలేదు (బౌండరీ వెలుపలే ఉన్నాడు). 13 ఏళ్ల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈసారి గీత దాటాడు (బౌండరీ లోపల). అంటే ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. అసలు సంగతి ఏంటటే... 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో తుషార్‌ అండర్‌–13 కేటగిరీలో బాలుడు. ముంబైలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఈ పిల్లాడు ‘బాల్‌బాయ్‌’గా పనిచేశాడు. ఇప్పుడేమో 25 ఏళ్ల ఈ పేసర్‌ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ స్టోక్స్‌తో పాటు శ్రేయస్‌ గోపాల్‌లను అవుట్‌ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు.

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) ఆర్చర్‌ 0; ధావన్‌ (సి) కార్తీక్‌ (బి) గోపాల్‌ 57; రహానే (సి) ఉతప్ప (బి) ఆర్చర్‌ 2; అయ్యర్‌ (సి) ఆర్చర్‌ (బి) త్యాగి 53; స్టొయినిస్‌ (సి) తేవటియా (బి) ఆర్చర్‌ 18; క్యారీ (సి) ఆర్చర్‌ (బి) ఉనాద్కట్‌ 14; అక్షర్‌ పటేల్‌ (సి) త్యాగి (బి) ఉనాద్కట్‌ 7; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1–0, 2–10, 3–95, 4–132, 5–153, 6–157, 7–161. 
బౌలింగ్‌:
ఆర్చర్‌ 4–0–19–3, ఉనాద్కట్‌ 3–0–32–2, కార్తీక్‌ త్యాగి 4–0–30–1, స్టోక్స్‌ 2–0–24–0, శ్రేయస్‌ గోపాల్‌ 4–0–31–1, రాహుల్‌ తేవటియా 3–0–23–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: స్టోక్స్‌ (సి) (సబ్‌) లలిత్‌ యాదవ్‌ (బి) తుషార్‌ దేశ్‌పాండే 41; బట్లర్‌ (బి) నోర్జే 22; స్మిత్‌ (సి అండ్‌ బి) అశ్విన్‌ 1; సామ్సన్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 32; రియాన్‌ పరాగ్‌ (రనౌట్‌) 1; రాహుల్‌ తేవటియా(నాటౌట్‌) 14; ఆర్చర్‌ (సి) రహానే (బి) రబడ 1; శ్రేయస్‌ గోపాల్‌ (సి) (సబ్‌) లలిత్‌ యాదవ్‌ (బి) తుషార్‌ దేశ్‌పాండే 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1–37, 2–40, 3–86, 4–97, 5–110, 6–135, 7–138, 8–148. 
బౌలింగ్‌: రబడ 4–0–28–1, తుషార్‌ దేశ్‌పాండే 4–0–37–2, నోర్జే 4–0–33–2, అశ్విన్‌ 4–0–17–1, అక్షర్‌ పటేల్‌ 4–0–32–1.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement