ఢిల్లీ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్ చరిత్రలో ఎట్టకేలకు ఆ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎక్కడ విఫలమైందో తెలుసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో క్వాలిఫయర్‌లో వాటిని అధిగమించింది. ఆఖరి అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుంది. ధావన్ మెరుపు ఇన్నింగ్స్... స్టొయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన... రబడ వైవిధ్యభరిత బౌలింగ్... ఢిల్లీని ఫైనల్ మెట్టుపై పడేసింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో సన్‌రైజర్స్ ఐపీఎల్–13ను మూడో స్థానంతో ముగించింది.
అబుదాబి: ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి టాప్–2 జట్లే టైటిల్ పోరుకు అర్హత పొందాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ‘సై’ అంటోంది. ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్), హెట్‌మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరువు నిలిపే పోరాటం చేశాడు. స్టొయినిస్ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు.
విలియమ్సన్ పోరాటం....
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు అనుభవజ్ఞుడైన అశ్విన్ తొలి ఓవర్లోనే 12 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ జోరు ఇక షురూ అనుకుంటున్న తరుణంలోనే రబడ రెండో ఓవర్ తొలి బంతికే వార్నర్ (2)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఐదో ఓవర్ వేసిన స్టొయినిస్... ప్రియమ్ గార్గ్ (17; 2 సిక్స్‌లు)ను బౌల్డ్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలో మనీశ్ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను ఔట్ చేశాడు. దీంతో 44 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేన్ విలియమ్సన్, హోల్డర్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. క్రీజులో కుదురుకున్నాక విలియమ్సన్ చెలరేగాడు.
హోల్డర్ (11) ఔటయ్యాక... అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. జట్టు స్కోరు 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరింది. ఈ దశలో పరుగుల వేగం పెరగడంతో ఢిల్లీ శిబిరం లో కలవరం మొదలైంది. 19 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన తరుణంలో విలియమ్సన్‌ను స్టొయినిస్ ఔట్ చేశాడు. రబడ ఒకే ఓవర్లో సమద్, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఐదో బంతికి శ్రీవత్స్ గోస్వామి (0) కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు నాలుగుసార్లు (2008, 2009–సెమీఫైనల్; 2012, 2019–ప్లే ఆఫ్స్ మూడో స్థానం) ప్రయత్నించి విఫలమైంది.
ఓపెనర్ల మెరుపులు...
అంతకుముందు ఢిల్లీ ఆరంభం నుంచే ధనాధన్‌కు శ్రీకారం చుట్టింది. తొలుత స్టొయినిస్... ఆ తర్వాత ధావన్ దంచేశారు. నాలుగో ఓవర్ వేసిన హోల్డర్‌ను స్టొయినిస్ చితగ్గొట్టాడు. 4, 0, 4, 0, 6, 4లతో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో 4.5 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపటికి స్టొయినిస్‌ను రషీద్‌ఖాన్ బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్లో ధావన్ ఫిఫ్టీ, జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత ఢిల్లీ ఆట చూస్తే వేగం తగ్గినట్లనిపించింది. 4 ఓవర్ల పాటు (11 నుంచి 14) 24 పరుగులే చేయగలిగింది. అయ్యర్ (21) ఔటయ్యాక వచ్చిన హెట్‌మైర్ చెలరేగడంతో ఢిల్లీ స్కోరు మళ్లీ పుంజుకుంది. హోల్డర్ 18వ ఓవర్లో హెట్‌మైర్ 3, ధావన్ ఒక బౌండరీ బాదడంతో 18 పరుగులొచ్చాయి. నటరాజన్ ఆఖరి ఓవర్‌ను నియంత్రించి 7 పరుగులే ఇచ్చాడు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: స్టొయినిస్ (బి) రషీద్ ఖాన్ 38; ధావన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 78; అయ్యర్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 21; హెట్‌మైర్ (నాటౌట్) 42; పంత్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 189.
వికెట్ల పతనం: 1–86, 2–126, 3–178.
బౌలింగ్: సందీప్ 4–0–30–1, హోల్డర్ 4–0–50–1, నదీమ్ 4–0–48–0, రషీద్ ఖాన్ 4–0–26–1, నటరాజన్ 4–0–32–0.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ప్రియమ్ గార్గ్ (బి) స్టొయినిస్ 17; వార్నర్ (బి) రబడ 2; మనీశ్ పాండే (సి) నోర్జే (బి) స్టొయినిస్ 21; విలియమ్సన్ (సి) రబడ (బి) స్టొయినిస్ 67; హోల్డర్ (సి) ప్రవీణ్ దూబే (బి) అక్షర్ 11; సమద్ (సి) (సబ్) కీమో పాల్ (బి) రబడ 33; రషీద్ ఖాన్ (సి) అక్షర్ (బి) రబడ 11;గోస్వామి (సి) స్టొయినిస్ (బి) రబడ 0; నదీమ్ (నాటౌట్) 2; సందీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–12, 2–43, 3–44, 4–90, 5–147, 6–167, 7–167, 8–168.
బౌలింగ్: అశ్విన్ 3–0–33–0, రబడ 4–0–29–4, నోర్జే 4–0–36–0, స్టొయినిస్ 3–0–26–3, అక్షర్ 4–0–33–1, ప్రవీణ్ దూబే 2–0–14–0.
► శిఖర్ ధావన్ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు. 2012లో ధావన్ అత్యధికంగా 569 పరుగులు సాధించాడు.
► ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు తరఫున ఒకే సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రబడ నిలిచాడు. ఈ సీజన్‌లో రబడ 29 వికెట్లు పడగొట్టాడు. మోర్నీ మోర్కెల్ (2012లో 25 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు.
Comments
Please login to add a commentAdd a comment