ఫైనల్‌పై రైజర్స్‌ గురి! | Qualifier-2 Match On Delhi Capitals vs Sunrisers Hyderabad 8 November | Sakshi
Sakshi News home page

ఫైనల్‌పై రైజర్స్‌ గురి!

Published Sun, Nov 8 2020 5:16 AM | Last Updated on Sun, Nov 8 2020 10:05 AM

Qualifier-2  Match On Delhi Capitals vs Sunrisers Hyderabad 8 November - Sakshi

హైదరాబాద్, ఢిల్లీ కెప్టెన్లు వార్నర్, శ్రేయస్‌ అయ్యర్‌

అబుదాబి: మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండోసారి ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడంపై గురి పెట్టింది. అద్భుత ఫామ్‌తో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీదున్న ఈ టీమ్‌కు ఇప్పుడు ‘క్వాలిఫయర్‌–2’ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూపంలో ప్రత్యర్థి ఎదురైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన హైదరాబాద్‌... ఇప్పుడు ఢిల్లీనీ ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. నాలుగుసార్లు చాంపియన్‌ ముంబైని టైటిల్‌ కోసం ఢీకొట్టాలంటే ముందుగా ఢిల్లీ అడ్డంకిని సన్‌రైజర్స్‌ అధిగమించాల్సి ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీ ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరలేదు.

ఫామ్‌ ప్రకారం చూస్తే ఢిల్లీకంటే హైదరాబాద్‌ జోరు మీదుంది. ఒక దశలో తొలి 9 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచి ఏడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ ఆ తర్వాత పుంజుకుంది. ఇప్పుడు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి సత్తా చాటింది. తుది జట్టు విషయంపై రైజర్స్‌కు పూర్తి స్పష్టత వచ్చేసింది. ముఖ్యంగా బౌలింగే రైజర్స్‌ బలంగా మారింది. గత ఆరు మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే హైదరాబాద్‌ ప్రత్యర్థులు 150కు పైగా పరుగులు చేయగలిగారు. అయితే మిడిలార్డర్‌లో కొంత తడబాటు ఉందని ఎలిమినేటర్‌లో కూడా కనిపించింది. దీనిని జట్టు అధిగమించడమే కీలకం. సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో శ్రీవత్స్‌ని కొనసాగించే అవకాశం ఉంది.

తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి అభేద్యంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆ తర్వాత కుప్పకూలింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు ఆఖరి లీగ్‌లో బెంగళూరుపై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరినా... టీమ్‌ ఆట మారలేదని తొలి క్వాలిఫయర్‌లో చెత్త ప్రదర్శన చూపించింది. జట్టు టాపార్డర్‌ మరీ పేలవం. ఎవరిని ఆడించాలో కూడా అర్థం కాని పరిస్థితి. రెండు సెంచరీలు చేసినా కూడా ధావన్‌ 4 డకౌట్‌లు నమోదు చేయగా... పృథ్వీ షా 3 సార్లు, రహానే 2 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌ కోసం డేనియల్‌ స్యామ్స్‌ స్థానంలో బ్యాటింగ్‌కు బలంగా మార్చేందుకు హెట్‌మైర్‌ రావచ్చు.

ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా హైదరాబాద్‌ గెలిచింది. తొలి మ్యాచ్‌లో 15 పరుగులతో నెగ్గిన రైజర్స్, రెండో పోరులో 88 పరుగులతో ఘన విజయం సాధించింది. అబుదాబిలో జరిగిన గత 9 మ్యాచ్‌లలో 8 సార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు ప్రభావం కూడా దీనికి కారణం కాబట్టి టాస్‌ కీలకం. అయితే శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మంచు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.

హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌ శ్రీవత్స్‌ గోస్వామి తొలి సీజన్‌ (2008) నుంచే ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. నాటినుంచి 2020 ఐపీఎల్‌ వరకు ఆడుతూ ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని (అన్‌క్యాప్డ్‌) ఆటగాడు అతనొక్కడే.

గత ఐపీఎల్‌లో నాకౌట్‌ దశలో హైదరాబాద్‌ను ఢిల్లీ దెబ్బ తీసింది. విశాఖపట్నంలో జరిగిన  ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఇప్పుడు మళ్లీ నాకౌట్‌ మ్యాచ్‌లో రెండు జట్లు తలపడుతున్నాయి.


శ్రీవత్స్‌ గోస్వామి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement