సోదరితో ధోని- జీవాతో సాక్షి
Who Is Jayanti Gupta?: మహేంద్ర సింగ్ ధోని.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియా స్టార్‌గా ఎదిగాడు. భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. మరి క్రికెటర్‌గా ధోని ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో అతడికి నైతికంగా, ఆర్థికంగా అండగా ఉన్నది ఎవరో తెలుసా?!
మధ్యతరగతి కష్టాలు
రాంచిలో 1981, జూలై 7 పాన్ సింగ్- దేవకీ దేవి దంపతులకు మహేంద్ర సింగ్ ధోని జన్మించాడు. అతడికి అక్క జయంతి గుప్తా, అన్న నరేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ధోని తండ్రి చిన్నపాటి ప్రభుత్వోద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి ఉండే కష్టాలన్నీ పడ్డారు.
అయితే, టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించినప్పటికీ ధోనికి.. చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలని, దేశం కోసం ఆడాలనే కోరిక బలంగా ఉండేది. ఈ విషయం గురించి తండ్రికి చెప్తే.. ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలు కావని ఆయన కాస్త వెనుకడుగు వేశారట.
నాన్నకు నచ్చజెప్పి
ఆ సమయంలో తమ్ముడికి అండగా నిలబడింది జయంతి గుప్తా. తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. క్రికెటర్ కావాలనుకుంటున్న తమ్ముడి ఆశయం గురించి వాళ్లకు అర్ధమయ్యేలా చేసింది. ధోనికి ఎలాంటి సాయం కావాలన్న ముందే ఉండేది. అలా ఇంట్లో వాళ్లను ఒప్పించి తన ప్రయాణం మొదలుపెట్టిన ఎంఎస్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
వెయ్యి కోట్లకు అధిపతి!
మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొంది అభిమానులతో జేజేలు కొట్టించుకున్నాడు. ఆటగాడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి దాదాపు వెయ్యి కోట్ల(DNA నివేదిక ప్రకారం)కు అధిపతి అయ్యాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మకుటం లేని మహారాజుగా కొనసాగుతూ ఏకంగా ఐదుసార్లు జట్టును విజేతగా నిలిపాడు.
అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఏడాదికి దాదాపు 50 కోట్ల రూపాయలు(DNA రిపోర్టు ప్రకారం) వెనకేస్తున్నాడు. ఇటీవలే సినీ రంగంలోనూ ప్రవేశించాడు. ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు.
అన్న, బావ, ధోని, అక్క
మరి అక్క పరిస్థితి ఏంటి?
మరి ఇలాంటి క్రికెట్ లెజెండ్‌ను తొలినాళ్ల నుంచే ప్రోత్సహించిన అక్క జయంతి గుప్తా.. లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆమె రాంచిలోని పబ్లిక్ స్కూళ్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
బావ కూడా ధోని కోసం
ఇక ధోనికి ప్రాణ స్నేహితుల్లో ఒకరైన గౌతం గుప్తా అనే వ్యక్తిని జయంతి పెళ్లి చేసుకుంది. ధోని దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో జయంతితో పాటు అతడు కూడా అండగా నిలబడినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా ధోని బయోపిక్‌లో జయంతి గుప్తా పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఎంఎస్ అన్న గురించి మాత్రం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కాగా ధోని సాక్షిని వివాహమాడగా.. వీరికి కూతురు జివా జన్మించింది.
చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
Comments
Please login to add a commentAdd a comment