ధోనితో రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు టైటిల్ అందించిన హిట్‌మ్యాన్ ఈసారి మాత్రం కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఫ్రాంఛైజీ నిర్ణయం మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆరు మ్యాచ్‌లు ఆడి 261 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(105*) కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఆట నుంచి విరామం దొరికిన సమయంలో రోహిత్ శర్మ క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్‌కాస్ట్‌లో భాగంగా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, ఆడం గిల్ క్రిస్ట్‌లతో సరదాగా ముచ్చటించాడు.
ధనాధన్ ధోని యూఎస్ వస్తాడు
ఈ సందర్భంగా ఐపీఎల్-2024లో అదరగొడుతున్న టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఎంఎస్ ధోనిని ఒప్పించడం కష్టం.
ఇప్పటికే తను కాస్త అనారోగ్యంతో ఉన్నాడు. బాగా అలసిపోయాడు. అతడు యూఎస్‌కు రావడమైతే ఖాయం. కానీ అక్కడ గోల్ఫ్ ఆడతాడు. ఇటీవలి కాలంలో ధోని గోల్ఫ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు’’ అని రోహిత్ పేర్కొన్నాడు.
డీకేను ఒప్పించడం తేలిక
ఏదేమైనా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ సీఎస్‌కే స్టార్ నాలుగు బంతుల్లోనే 20 రన్స్ రాబట్టిన తీరు అమోఘమని కొనియాడాడు. ఇక మరో వెటరన్ ప్లేయర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ గురించి ప్రస్తావిస్తూ.. డీకేను వరల్డ్‌కప్‌లో ఆడేలా కన్విన్స్ చేయడం చాలా సులువని రోహిత్ సరదాగా కామెంట్ చేశాడు.
అదే విధంగా.. యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి మాట్లాడుతూ.. ‘‘క్రేజీ. అందరు యువ ఆటగాళ్లు ఇలాగే ఉంటారనుకోండి. అందులో పంత్ మరింత క్రేజీ. నేను ఎప్పుడైనా ముభావంగా ఉన్నపుడు నవ్వేలా చేస్తాడు.
పంత్ అత్యుత్తమ ప్రదర్శన
అతడు పిల్లాడిగా ఉన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే.. గతేడాది ఆ దుర్ఘటన కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావడం బాధనిపించింది. తను తిరిగిరావడం సంతోషంగా ఉంది. వికెట్ కీపర్‌గానూ పంత్ అదరగొడుతున్నాడు. గాయాల నుంచి కోలుకుని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
వికెట్ కీపర్‌గా అతడే?
కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్‌కప్-2024 ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే టీమిండియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్‌గా పంత్ పేరు ఖరారైందని రోహిత్ శర్మ పరోక్షంగా చెప్పాడంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు.
చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment