అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్‌లో బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ పాట్ కమిన్స్ పూర్తిగా విఫలమైన వేళ తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం కోటా పూర్తి చేయకుండానే కేవలం 3 ఓవర్లే వేసిన కమిన్స్ 16 ఎకానమీ రేటుతో 49 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తిక్ మాత్రం పాట్ కమిన్స్‌ను వెనుకేసుకొచ్చాడు. (చదవండి : కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!)
'పాట్ కమిన్స్ ఒక్క మ్యాచ్‌తోనే తప్పుబట్టడం సరికాదు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత కాస్త ఆలస్యంగా దుబాయ్ చేరుకున్న కమిన్స్ మ్యాచ్ ముందు వరకు క్వారంటైన్‌లోనే ఉండాల్సి వచ్చింది. అసలు ముంబైతో జరగనున్న మ్యాచ్‌కు బరిలోకి దిగుతాడా లేడా అనేది చివరివరకు అనుమానుంగా ఉంది. కానీ అనూహ్యంగా మ్యాచ్ ప్రారంభానికి సరిగ్గా రెండు గంటల ముందు అంటే 3.30 లేదా 4 గంటల ప్రాంతంలో కమిన్స్ ఆడేందుకు అనుమతి లభించింది. క్వారంటైన్‌లో ఉన్న కమిన్స్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముంబైతో మ్యాచ్‌లో అతని బౌలింగ్ లయ తప్పింది. ఇలా ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా ఈ విధంగా తప్పు బట్టడం కరెక్ట్ కాదు.. కమిన్స్ మీద రూ. 15 కోట్లు పెట్టామంటే అతని మీద మాకున్న నమ్మకమేంటో మీకు అర్థమవ్వాలి. ప్రస్తుతం కమిన్స్ టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్.. అంతేగాక అతనొక చాంపియన్. రానున్న మ్యాచ్‌ల్లో తన లయను అందుకొని ఒక మంచి ప్రదర్శన ఇస్తాడని ఎదురుచూస్తున్నా' అంటూ తెలిపాడు.
ఇక మ్యాచ్ గురించి దినేష్ కార్తిక్ స్పందించాడు. ' టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకోవడంలో మాకు స్ట్రాటజీ ఉంది. కానీ అనూహ్యంగా మా బౌలర్లు రాణించలేకపోయారని.. ముంబై ఇన్నింగ్స్‌లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్‌లు చక్కగా ఆడారు. వరుస విరామాల్లో వికెట్లు తీయలేకపోయినా.. రోహిత్ అవుటైన తర్వాత మా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శివమ్ మావి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన మావి 32 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కేకేఆర్‌కు శివమ్ మావి ఒక మంచి బౌలర్‌గా తయారవుతున్నాడు.'అంటూ చెప్పుకొచ్చాడు. కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ సెప్టెంబర్ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. (చదవండి : 'రసెల్ కంటే శుభమన్ కీలకం కానున్నాడు')
Comments
Please login to add a commentAdd a comment