సునీల్ నరైన్(కర్టసీ : ఐపీఎల్/బీసీసీఐ)
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్ లో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎంపిక సరిగా లేకపోవడం కూడా కేకేఆర్ ఓటమికి పరోక్ష కారణంగా చెప్పవచ్చు. ఈ సీజన్‌లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి సునీల్ నరైన్ ఓపెనింగ్ మొదలుపెట్టడం నుంచి కార్తీక్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవుతుండడం.. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న మోర్గాన్ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగడం.. ఓపెనర్ స్థానంలో రావాల్సిన రాహుల్ త్రిపాఠిని ఎనిమిదో స్థానంలో పంపడం లాంటివి చెప్పుకుంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. (చదవండి : పేరు మాత్రమే పంత్.. కానీ పనులు మాత్రం)
ముఖ్యంగా కేకేఆర్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి నరైన్.. 87.09 స్ట్రైక్‌రేట్.. 6.75 సగటుతో బ్యాటింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి సునీల్ నరైన్ కేకేఆర్‌కు ఎంపికైంది బౌలింగ్ కోటాలోనే. అతను ఐపీఎల్‌లో 124 వికెట్లు తీశాడు. పలు సీజన్లలో ఓపెనర్‌గా వచ్చి కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు గానీ పూర్తిస్థాయి ఓపెనర్‌గా మాత్రం ఎప్పుడు కాలేకపోయాడు. అయినా కొన్ని సీజన్లుగా కేకేఆర్ జట్టు అతన్నే ఓపెనర్‌గా పంపిస్తుంది. ఈ సీజన్‌లోనూ అతనిపై నమ్మకముంచి ఓపెనర్‌గా పంపినా ఆదిలోనే అతను ఔటవుతుండడంతో భారం పడినట్లవుతుంది. దీంతో పాటు నరైన్ అటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండే ఓవర్లు వేసిన నరైన్ 26 పరగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లకు ఓపెనర్ స్థానంలో మరొకరిని పంపిస్తే కేకేఆర్‌కు శుభారంభాలు దక్కుతాయి. (చదవండి : ‘అతను కెప్టెన్ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు’)
అయితే ఇదే విషయమై కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ' ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు నాకు ఎలాంటి ఆలోచన లేదు. అయితే టాప్ ఆర్డర్‌ను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని గ్రహించాను. ఓపెనింగ్ విషయమై ఒకసారి కోచింగ్ స్టాఫ్‌తో మాట్లాడిన తర్వాత నరైన్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాము. నరైన్‌పై తనకు ఇంకా నమ్మకముందని.. ఒక్క మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ పడిందంటే మిగతావాటిలో రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇక రసెల్‌ను బ్యాటింగ్ అవకాశం ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని.. అలాగే మోర్గాన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై రానున్న మ్యాచ్‌లో మార్పు చూసే అవకాశం ఉంది. నిజానికి నా వైఫల్యం కూడా జట్టుకు భారంగా మారింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్, త్రిపాఠి, నితీష్ రాణాలు చక్కగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లు కొన్ని సిక్స్‌లు అధనంగా సమర్పించుకోవడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయితే 18 పరుగులతో ఓటమి పాలవడం కాస్త బాధ అనిపించింది. అంటూ తెలిపాడు. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 7న సీఎస్‌కేతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment