West Indies vs India ODI Series: అనవసర ప్రయోగాలతో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో పరాభవం పాలైంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ.. లోపాలను సరిచేసుకోకపోగా మరోసారి ఎక్స్‌పెరిమెంట్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చి భారీ మూల్యం చెల్లించింది. వన్డే ప్రపంచకప్-2023కి అర్హత సాధించని జట్టు చేతిలో ఓటమి పాలైంది.
బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి ఫలితం అనుభవించింది. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో విండీస్ గెలిచేందుకు బాటలు వేసింది. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు ముందు వెస్టిండీస్ లాంటి జట్ల చేతిలో ఓడటం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కనీసం మూడో వన్డేలోనైనా చెత్త ప్రయోగాలకు వెళ్లకుండా.. జట్టును ఎంపిక చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిర్ణయాన్ని సమర్థించుకున్న ద్రవిడ్
ఈ క్రమంలో టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెండో వన్డేలో రోహిత్, కోహ్లిలను తప్పిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని చెప్పకనే చెప్పాడు.
‘‘మేము దీర్ఘకాలిక ప్రయోజనాల కోణంలో దూరదృష్టితో ఆలోచిస్తున్నాం. ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలకు సమయం ఆసన్నమవుతోంది. మా జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. ఇలాంటపుడు మేము కచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి చిన్న విషయం గురించి పట్టించుకోం
ప్రతి చిన్న విషయం గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి మ్యాచ్‌ను పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రతి సిరీస్ గురించి బెంబేలెత్తిపోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు. ఒకవేళ మేము వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే పెద్ద తప్పు చేసినవాళ్లమవుతాం’’ అని ద్రవిడ్.. ప్రయోగాలకు వెనుకాడబోమని కుండబద్దలు కొట్టాడు.
కీలక ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్న వేళ.. మెగా ఈవెంట్లను దృష్టిలో పెట్టుకునే ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నామని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్- టీమిండియా మధ్య మంగళవారం (ఆగష్టు 1)న నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.
చదవండి: కుల్దీప్‌ను అంత మాటన్నాడా? ‘చెత్త’ వాగుడు కట్టిపెట్టు సూర్య.. ఇదేం పద్ధతి!
Comments
Please login to add a commentAdd a comment