అప్పుడు డకౌట్‌.. ఇప్పుడు వికెట్‌! శ్రేయస్‌ సెలబ్రేషన్స్‌ | DT 2024: Shreyas Iyer Dismisses India Batter On His First Ball Celebration Viral | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ వికెట్‌ తీసిన శ్రేయస్‌ అయ్యర్‌.. ఆరేళ్ల తర్వాత తొలిసారి ఇలా!

Published Fri, Sep 13 2024 8:06 PM | Last Updated on Fri, Sep 13 2024 9:03 PM

DT 2024: Shreyas Iyer Dismisses India Batter On His First Ball Celebration Viral

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆరేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి వికెట్‌ తీశాడు. దులిప్‌ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో ఇండియా-‘డి’ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఇండియా-‘ఎ’ తో మ్యాచ్‌లో ఈ మేర తన బౌలింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శించాడు. భారత టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా అయ్యర్‌ ఈ రెడ్‌బాల్‌ టోర్నీ బరిలో దిగాడు.

తొలి టెస్టులో  స్థానం దక్కలేదు
ఇండియా-‘సి’తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో సారథిగా ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో అర్ధ శతకం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడబోయే తొలి టెస్టులో శ్రేయస్‌ అయ్యర్‌కు స్థానం దక్కలేదు. దీంతో దులిప్ ట్రోఫీ జ‌ట్టుతోనే ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాట‌ర్‌.. ప్రస్తుతం ఇండియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌ ఆడుతున్నాడు. 

అనంతపురం వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇండియా-‘డి’ కెప్టెన్‌శ్రేయస్‌ అయ్యర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా-‘ఎ’ను తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్‌ చేయగలిగింది ఇండియా-‘డి’.

దేవ్‌దత్‌ పడిక్కల్‌ 92
కానీ బ్యాటింగ్‌ పరంగా మాత్రం రాణించలేకపోయింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్‌ కాగా.. మరో టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ 92 రన్స్‌తో అదరగొట్టగా.. రికీ భుయ్‌ 23, హర్షిత్‌ రాణా 31 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరి కారణంగా ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగలింది.

స్వయంగా రంగంలోకి దిగిన కెప్టెన్‌
ఈ క్రమంలో వందకు పైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇండియా-‘ఎ’ జట్టుకు ఓపెనర్లు ప్రథమ్‌ సింగ్‌, మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరు మరింత పెంచారు. ఈ జోడీని విడగొట్టడం ఇండియా-‘డి’ బౌలర్ల తరం కాలేదు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్వయంగా రంగంలోకి దిగాడు.

రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల అయ్యర్‌.. ఇండియా-‘ఎ’ ఇన్నింగ్స్‌‌ 29వ ఓవర్‌ తొలి బంతికే కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(56)ను అవుట్‌ చేశాడు. ఊహించని రీతిలో రిటర్న్‌ క్యాచ్‌ అందుకుని మయాంక్‌కు షాకిచ్చాడు. ఆరేళ్ల తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వికెట్‌ తీయడం ఇదే తొలిసారి. 

అంతకు ముందు సౌరాష్ట్రతో 2018 నాటి మ్యాచ్‌లో అతడు వికెట్‌(చేతన్‌ సకారియా) పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఇండియా-‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 115 పరుగులు చేసింది.  ఇండియా-‘డి’పై 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్‌ మాజీ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement