Duleep Trophy: ఈ ఐదుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లపైనే అం‍దరి దృష్టి! | Duleep Trophy 2024: 5 Uncapped Indian Players To Watch Out | Sakshi
Sakshi News home page

Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లపైనే!

Published Mon, Aug 26 2024 8:06 PM | Last Updated on Mon, Aug 26 2024 9:07 PM

Duleep Trophy 2024: 5 Uncapped Indian Players To Watch Out

శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్‌ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్‌ టోర్నీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు.

ఈ టోర్నీకి సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది. ఆటగాళ్లను టీమ్‌-ఏ, టీమ్‌-బి, టీమ్‌-సి, టీమ్‌-డిగా విభజించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌​, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ తదితరులు పాల్గొననున్న ఈ టోర్నీలో.. ఐదుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కూడా హైలైట్‌గా నిలవనున్నారు.

అభిమన్యు ఈశ్వరన్‌
బెంగాల్‌ బ్యాటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ దులిప్‌ ట్రోఫీ-2024లో టీమ్‌-బి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఇప్పటి వరకు 94 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు.

ఇప్పుడు ఈ టోర్నీలో గనుక ఈశ్వరన్‌ సత్తా చాటితే.. బంగ్లాతో సిరీస్‌లో టీమిండియా బ్యాకప్‌ ఓపెనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యశ్‌ దయాల్‌
దులిప్‌ ట్రోఫీ-2024లో లెఫ్టార్మ్‌ పేసర్‌ యశ్‌ దయాల్‌ టీమ్‌-బికి ఆడనున్నాడు. 26 ఏళ్ల ఈ యూపీ బౌలర్‌ ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు.  ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ తరఫున కూడా సత్తా చాటాడు. దులిప్‌ టోర్నీలో యశ్‌ దయాల్‌ ఆకట్టుకుంటే బంగ్లాతో సిరీస్‌ నేపథ్యంలో అతడి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

హర్షిత్‌ రాణా
ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు హర్షిత్‌ రాణా. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ  ఢిల్లీ బౌలర్‌ జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే, ఈ 22 ఏళ్ల ఈ రైటార్మ్‌ పేసర్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.

ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీసిన హర్షిత్‌ రాణా.. దులిప్‌ ట్రోఫీలో టీమ్‌-డికి ఆడనున్నాడు. మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నాడు.

నితీశ్‌కుమార్‌ రెడ్డి
ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడి ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి. ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ.. ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దురదృష్టవశాత్తూ గాయపడి.. జింబాబ్వే టూర్‌కు వెళ్లలేకపోయాడు. అయితే, దులిప్‌ ట్రోఫీ(టీమ్‌-బి)లో సత్తా చాటితే మాత్రం.. ఆస్ట్రేలియాతో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

ముషీర్‌ ఖాన్‌
టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడే ముషీర్‌ ఖాన్‌. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ మిడిలార్డర్‌లో రాణించగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్‌. దేశవాళీ క్రికెట్లో ముంబైకివ ఆడుతున్న ముషీర్‌.. గత రంజీ సీజన్లో ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. 

ఇందులో ఓ డబుల్‌ సెంచరీ ఉండటం విశేషం. కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలోనే ఈ మేర స్కోరు చేశాడు. పందొమిదేళ్ల ముషీర్‌ ఖాన్‌ దులిప్‌ ట్రోఫీలో టీమ్‌-బికి ఆడనున్నాడు. అన్నకు పోటీగా బ్యాట్‌తో రంగంలోకి దిగనున్నాడు.

చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్‌ ట్రోఫీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement