రసవత్తరం.. ఫలితం ఖాయం | Duleep Trophy 2024 Highlights | Sakshi
Sakshi News home page

రసవత్తరం.. ఫలితం ఖాయం

Published Sat, Sep 7 2024 8:57 AM | Last Updated on Sat, Sep 7 2024 1:15 PM

Duleep Trophy 2024 Highlights

హోరాహోరీగా దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ 

 5 వికెట్లతో చెలరేగిన మనవ్‌ సుతార్‌ 

ఇరు జట్లలో ముగ్గురు హాఫ్‌ సెంచరీలు

అనంతపురం: దులీప్‌ ట్రోఫీలో భాగంగా అనంత క్రీడాగ్రామం ప్రధాన స్టేడియంలో ఇండియా –సి, ఇండియా – డి జట్ల మధ్య రెండో రోజు శుక్రవారం జరిగిన మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ఒకే రోజు ఇండియా–సి జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఇంద్రజిత్, ఇండియా–డి జట్టు కెపె్టన్‌ శ్రేయస్‌ అయ్యర్, పడిక్కల్‌ అర్ధసెంచరీలతో అలరించారు. ఇండియా –సి బౌలర్‌ మనవ్‌ సుతార్‌ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు.   అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తింది. ఇరు జట్ల బౌలర్లూ పోటాపోటీగా రాణిస్తున్నందున మూడో రోజు శనివారమే మ్యాచ్‌ ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇండియా –డి జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇండియా–డి జట్టు 202 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.  

ఆదుకున్న ఇంద్రజిత్‌  
ఓవర్‌నైట్‌ స్కోరు 91/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇండియా–సి జట్టు 48.3 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్‌ అయింది. రెండో రోజు 77 పరుగులు మాత్రమే చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ బాబా ఇంద్రజిత్‌ 149 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. ఇండియా–డి బౌలర్లలో పేసర్‌ హర్షిత్‌ రాణా 4, అక్షర్‌ పటేల్‌ 2, సరాన్‌‡్ష జైన్‌2, అర్షదీప్‌ సింగ్, ఆదిత్య థాక్రే చెరో వికెట్‌ తీశారు.  



సుతార్‌ దెబ్బకు తడబడిన ఇండియా–డి 
తొలి ఇన్నింగ్స్‌లో లాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ      ఇండియా–డి జట్టు తడబడింది. ఇండియా–సీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ మనవ్‌ సుతార్‌ 15 ఓవర్లలో 30 పరుగులిచ్చి పడిక్కల్, శ్రీకర్‌ భరత్, సరాన్‌‡్ష జైన్, అర‡్షదీప్, రికీ భుయిలను పెవిలియన్‌కు పంపాడు. అతనికి తోడుగా పేసర్‌ వైశాక్‌ రెండు వికెట్లు తీసి రాణించాడు. దీంతో ఇండియా–డి ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్‌పటేల్‌ (11), హర్షిత్‌ రాణా (0) ఉన్నారు. శ్రేయస్‌ అయ్యర్, డేవదత్‌ పడిక్కల్‌ అర్ధ సెంచరీలతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేసినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ 44 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 54 పరుగులు, పడిక్కల్‌ 70 బంతుల్లో 8 బౌండరీలతో 56 పరుగులు చేశారు. మరో బ్యాటర్‌ రికీ భుయి 44 (5 ఫోర్లు, ఒక సిక్సర్‌) పరుగులు చేశాడు. 

గ్రౌండ్‌లోకి దూసుకెళ్లిన అభిమాని 
రెండో రోజు ఆటలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. పరుగెత్తుకుంటూ వచ్చిన సదరు అభిమాని.. మిడాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న భారత యువ ఓపెనర్, ఇండియా–సి జట్టు కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

అభిమాన శిఖరం 
క్రీడాగ్రామంలో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఓ అభిమాని అందరినీ ఆకర్షించాడు. భారత స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ వీరాభిమాని అయిన శంకర్‌ గీతా ధావన్‌ రూ.13 లక్షలు ఖర్చు పెట్టి తన శరీరంపై శిఖర్‌ ధావన్‌ ఫొటోలతో కూడిన టాటూలు వేయించుకున్నాడు. శిఖర్‌ ధావన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎప్పుడు సెంచరీ సాధించింది తదితర అన్ని వివరాలు టాటూలో పొందుపరిచాడు. ముష్టూరు గ్రామానికి చెందిన శంకర్‌ గీతా ధావన్‌.. శిఖర్‌ ధావన్‌ ఎక్కడకెళ్లి మ్యాచ్‌ ఆడినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. విదేశాల్లో ఆడినా సరే అక్కడికి వెళ్లి మ్యాచ్‌ తిలకిస్తాడు. దీంతో మురిసిపోయిన శిఖర్‌ ధావన్‌ రూ.20 వేల విలువ చేసే తన చేతి గడియారాన్ని   శంకర్‌ గీతా ధావన్‌కు బహుమానంగా ఇచ్చాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement