సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన ముషీర్‌ ఖాన్‌! | Duleep Trophy: Musheer Khan Breaks Massive Tendulkar Record After 33 Years | Sakshi
Sakshi News home page

Musheer Khan: సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన ముషీర్‌ ఖాన్‌!

Published Fri, Sep 6 2024 4:01 PM | Last Updated on Fri, Sep 6 2024 4:13 PM

Duleep Trophy: Musheer Khan Breaks Massive Tendulkar Record After 33 Years

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్‌ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌. దులిప్‌ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్‌ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ పట్టుదలగా నిలబడ్డాడు.

ఫోర్ల వర్షం
మొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్‌ స్పి న్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ముషీర్‌ అవుట్‌ కావడం గమనార్హం.

ఇక ముషీర్‌కు తోడు టెయిలెండర్‌ నవదీప్‌ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది.

సచిన్‌ రికార్డు బద్దలు
కాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్‌ ఖాన్‌.. ఈ మ్యాచ్‌ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్‌లోనే దులిప్‌ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ను ముషీర్‌ వెనక్కినెట్టాడు.

కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్‌ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్‌.. ఈస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్‌ సచిన్‌ను అధిగమించాడు.

అన్నను మించిపోతాడేమో!
దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్‌ ఖాన్‌ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్‌ ఖాన్‌కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్‌లో రాణించగల సత్తా ఉన్న స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. గత రంజీ సీజన్‌లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. 

అంతేకాదు... అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్‌ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.

దులిప్‌ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు
19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్‌- 212 పరుగులు(2013లో)
19 ఏళ్ల వయసులో యశ్‌ ధుల్‌- 193 పరుగులు(2022లో)
19 ఏళ్ల వయసులో ముషీర్‌ ఖాన్‌- 181 పరుగులు(2024లో)
18 ఏళ్ల వయసులో సచిన్‌ టెండుల్కర్‌-159 పరుగులు (1991లో).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement