SL VS PAK: శ్రీలంక యువ సంచలనం అరుదైన ఘనత | Dunith Wellalage Dismantled 1, 2, 8 And 9 ODI Rankers In Asia Cup 2023 | Sakshi
Sakshi News home page

SL VS PAK: శ్రీలంక యువ సంచలనం అరుదైన ఘనత

Published Thu, Sep 14 2023 8:16 PM | Last Updated on Thu, Sep 14 2023 8:20 PM

Dunith Wellalage Dismantled 1, 2, 8 And 9 ODI Rankers In Asia Cup 2023 - Sakshi

శ్రీలంక యువ సంచలన స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న నాలుగురు బ్యాటర్లను ఔట్‌ చేశాడు. వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌తో పాటు వరల్డ్‌ నంబర్‌ 2 బ్యాటర్‌, టీమిండియా యంగ్‌ గన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. వరల్డ్‌ నంబర్‌ 8, 9 బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను పెవిలియన్‌కు పం​పాడు.

సెప్టెంబర్‌ 12న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌, గిల్‌, కోహ్లిలతో పాటు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాల వికెట్లు కూడా తీసిన వెల్లలగే.. ఇవాళ (సెప్టెంబర్‌ 14) పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక పోరులో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ భరతం​ పట్టాడు. వెల్లలగే సంధించిన బంతికి బోల్తా కొట్టిన బాబర్‌ స్టంపౌటయ్యాడు. వెల్లలగే కేవలం​ 3 రోజుల వ్యవధిలో వరల్డ్‌ టాప్‌ బ్యాటర్లనంతా ఔట్‌ చేయడంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

భారత్‌, పాక్‌ మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టిన వెల్లలగే, గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌పై ఓ వికెట్‌.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై మరో 2 వికెట్లు.. దీని తర్వాత సూపర్‌-4లో బంగ్లాదేశ్‌పై మరో వికెట్‌.. ఇలా మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు తీసి, లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వెల్లలగే బంతితో మ్యాజిక్‌ చేయడమే కాకుండా, బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించగలడు. టీమిండియాతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో ఓ పక్క అతని సహచరులు, స్పెషలిస్ట్‌ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా అతను మాత్రం చివరివరకు ఒంటరిపోరాటం (42 నాటౌట్‌) చేసి అజేయంగా నిలిచాడు. 

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పట్టుబిగించింది. లంక బౌలర్లు 130 పరుగులకే (27.4 ఓవర్లలో) సగం మంది పాక్‌ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపారు. ఈ దశలో వర్షం ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా, మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement