Emotional Sachin Tendulkar About His Son Arjun, Never Gone And Watched His Play Before IPL Debut - Sakshi
Sakshi News home page

అర్జున్‌ ఇక్కడిదాకా చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు.. అరుదైన ఘనత! సచిన్‌ భావోద్వేగం! వీడియో

Published Mon, Apr 17 2023 12:45 PM | Last Updated on Mon, Apr 17 2023 2:01 PM

Emotional Sachin Tendulkar About His Son Arjun Never Gone Watched His Play - Sakshi

సచిన్‌ టెండుల్కర్‌ పుత్రోత్సాహం (Photo Credit: IPL Twitter)

IPL 2023- Sachin Tendulkar- Arjun Tendulkar: టీమిండియా దిగ్గజం, క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. తన కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఐపీఎల్‌ అరంగేట్రాన్ని చూసి మురిసిపోయాడు. ఇంతవరకు అర్జున్‌ ఆటను నేరుగా చూసిందే లేదని.. తన జీవితంలో ఇదో సరికొత్త అనుభవమంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్న అర్జున్‌ టెండుల్కర్‌ ఎట్టకేలకు ఆదివారం అరంగేట్రం చేశాడు.

తొలి ఓవర్లో అదుర్స్‌
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అర్జున్‌.. తండ్రి ప్రాతినిథ్యం వహించిన జట్టుకే ఆడి అరుదైన రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్జున్‌ మొత్తంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అర్జున్‌ చేతికి తొలి ఓవర్లోనే బంతిని అందించగా.. ఐపీఎల్‌లో తన మొదటి ఓవర్లో అర్జున్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

ఆ తర్వాత
ఇక మూడో ఓవర్లో మరోసారి తన చేతికి బంతి రాగా.. అర్జున్‌ 13 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో కేకేఆర్‌ సెంచరీ స్టార్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ వరుసగా ఫోర్‌, సిక్సర్‌ బాదాడు. తర్వాత జూనియర్‌​ టెండుల్కర్‌కు మళ్లీ బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్‌ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని ముంబై 17.4 ఓవర్లలోనే ఊదేసింది. ఇక మ్యాచ్‌లో అర్జున్‌కు బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకుండా పోయింది.

భావోద్వేగ ట్వీట్‌
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు కుమారుడిని ఉద్దేశించి... ‘‘అర్జున్‌.. క్రికెటర్‌గా నీ ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన ముందడుగు. ఓ తండ్రిగా.. నిన్నూ, ఆటను ప్రేమించే వ్యక్తిగా.. క్రికెట్‌ పట్ల అంకిత భావంతో ముందుకు సాగుతావని నాకు తెలుసు.

ఆట కూడా నువ్విచ్చే గౌరవానికి ప్రతిఫలాన్ని ఫలితాల రూపంలో తప్పకుండా అందిస్తుంది. ఇక్కడిదాకా చేరుకోవడానికి నువ్వు ఎంత కఠిన శ్రమకోర్చావో నాకు తెలుసు. అదే పట్టుదలతో ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుకుంటావని నమ్ముతున్నా. ఆల్‌ ది బెస్ట్‌’’ అని సచిన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

కొత్తగా ఉంది.. ఉద్వేగానికి లోనైన సచిన్‌
ఇక మ్యాచ్‌ చూసిన తర్వాత ఐపీఎల్‌ ఇంటర్వ్యూలో సచిన్‌ మాట్లాడుతూ.. ‘‘తనను తాను ఎలా నిరూపించుకోవాలని కోరుకుంటున్నాడో అలాగే చేయమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ఈరోజు కూడా నేను డ్రెస్సింగ్‌ రూంలోనే కూర్చున్నా. ఎందుకంటే నన్ను చూస్తే తన ఆలోచనలు మారిపోవచ్చు.

తన ప్రణాళికలను అమలు చేసే అంశంపై ప్రభావం పడొచ్చు. మెగా స్క్రీన్‌ మీద తనను చూస్తూ ఉన్నా. నిజంగా నాకిది కొత్త అనుభవం. 2008లో మొదటి సీజన్‌..  16 ఏళ్లవుతోంది.. ఇప్పుడు నా కుమారుడు కూడా ఇదే జట్టుకు ఆడటం బాగుంది’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

చదవండి: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్‌ టెండుల్కర్‌ను చూడండి!’ 
 చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్‌ రాణాకు బీసీసీఐ షాక్‌! సూర్యకు భారీ జరిమానా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement