ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నేపథ్యంలో వెస్టిండీస్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. పేసర్ జెరెమా లూయీస్ స్థానంలో అకీం జోర్డాన్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
కాగా విండీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 10న ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.
చిత్తు చిత్తుగా ఓడి
పర్యాటక వెస్టిండీస్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఇక నాటింగ్‌హామ్‌లో జూలై 18- 22 వరకు జరిగిన రెండో టెస్టులోనూ వెస్టిండీస్‌కు పరాభవమే ఎదురైంది. 241 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయింది.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జూలై 26 నుంచి నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. బర్మింగ్‌హాంలోని ఎడ్జ్‌బాస్టన్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో ముందడుగు వేయాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.
దురదృష్టం
మరోవైపు.. ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. అయితే, ఇంతవరకూ టెస్టులాడని జెరెమీ లూయిస్‌కు విండీస్ ఈ సిరీస్ ద్వారా పిలుపునివ్వగా.. తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉన్నాడు. కానీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
అయితే, మూడో టెస్టుకు ముందు అతడు గాయపడినట్లు విండీస్ బోర్డు తెలిపింది. తొడ కండరాల గాయం కారణంగా జెరెమా జట్టుకు దూరమైనట్లు తెలిపింది. అయితే, అతడు జట్టుతో పాటే ఉంటూ చికిత్స తీసుకుంటాడని తెలిపింది. జెరెమా స్థానంలో అకీమ్ జోర్డాన్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొంది.
లైన్ క్లియర్!
కాగా 29 ఏళ్ల అకీమ్ జోర్డాన్ ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. బార్బడోస్‌కు చెందిన ఈ ఫాస్ట్‌బౌలర్ ఫస్ట్‌క్లాస్ రికార్డు మెరుగ్గా ఉంది. 19 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 67 వికెట్లు తీశాడు. ప్రస్తుతం యూకేలోనే ఉన్న జోర్డాన్ జట్టుతో చేరినట్లు సమాచారం.
ఇక విండీస్ పేస్ దళంలో అల్జారీ జోసెఫ్, జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ అందుబాటులో ఉన్నారు. అయితే, తదుపరి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో వీరిలో ఒకరికి బోర్డు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అలా అయితే, జోర్డాన్ అరంగేట్రానికి మార్గం సుగమమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment