పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు వెల్లడించింది.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.
శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులు
వచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.
అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు ముల్తాన్.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.
నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్ జట్టు ముల్తాన్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్ చివరగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది.
ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగమైన ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్ షాన్ మసూద్ బృందానికి విషమ పరీక్షగా మారింది.
చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment