నార్తాంప్టన్: వర్షం ఆటంకం కలిగించిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో భారత మహిళలపై గెలిచింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. సీవర్ (27 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), అమీ జోన్స్ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. శిఖా పాండేకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కూడా వర్షం దోబూచులాడటంతో ఆట సరిగ్గా సాగనేలేదు. లక్ష్యఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. షఫాలీ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (29; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. హర్లీన్ (17 నాటౌట్), దీప్తి శర్మ (3 నాటౌట్) క్రీజులో ఉండగా మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను ఆపేసి డక్‌వర్త్ పద్ధతిలో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటిం చారు. ఆటను నిలిపివేసే సమయానికి డక్‌వర్త్ పద్ధతిలో భారత్ గెలవాలంటే స్కోరు 73గా ఉండాల్సింది.
సూపర్... సూపర్...ఉమన్ హర్లీన్
అబ్బాయిల క్రికెట్ ఎక్కడ... అమ్మాయిల క్రికెట్ ఎక్కడ! వారి మెరుపులు చుక్కలు... మరి వీరి మెరుపులు మామూలు సిక్సర్లు! అంటే సరిపోతుందేమో కానీ... పురుషుల ఫిట్‌నెస్ భళా అతివల ఫిట్‌నెస్ డీలా అంటే కుదరదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనమ్మాయే... పేరు హర్లీన్ డియోల్. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఈమె తొలి టి20లో అసాధారణ క్యాచ్ పట్టింది. బహుశా మహిళల క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్ ఇదే మొదటిది. అందుకనే ప్రత్యర్థి ఇంగ్లండ్ శిబిరం కూడా ఆమె క్యాచ్‌కు చప్పట్లు కొట్టింది. ఆనంద్ మహీంద్రాలాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఔరా అన్నారంటే అర్థం చేసుకోండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో శిఖా పాండే 19వ ఓవర్ వేసింది. ఐదో బంతిని అమీ జోన్స్ భారీ షాట్ ఆడింది. బౌండరీ లైన్‌కు తాకెంత దగ్గర్లో హర్లీన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. బౌండరీ అవతల పడిపోతానని తెలిసిన ఆమె బంతిని గాల్లో వదిలి లైన్ దాటింది. మళ్లీ అక్కడ్నుంచి బంతి నేలను తాకేలోపే మైదానంలోకి డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ అందుకుంది.
మ్యాచ్ పోయింది... క్యాచ్ అదిరింది!
Published Sun, Jul 11 2021 4:33 AM | Last Updated on Sun, Jul 11 2021 4:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment