రాణించిన రషీద్‌, సాల్ట్‌.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌ | England Beat Pakistan By 7 Wickets In 4th T20 To Clinch The Series | Sakshi
Sakshi News home page

రాణించిన రషీద్‌, సాల్ట్‌.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌

Published Fri, May 31 2024 7:03 AM | Last Updated on Fri, May 31 2024 8:49 AM

England Beat Pakistan By 7 Wickets In 4th T20 To Clinch The Series

టీ20 ప్రపంచకప్‌ 2024కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్‌ చిత్తుగా ఓడింది. నిన్న (మే 30) ముగిసిన నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవల్‌ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్‌ రషీద్‌ (4-0-27-2), లివింగ్‌స్టోన్‌ (3-1-17-2), మార్క్‌ వుడ్‌ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (36), ఉస్మాన్‌ ఖాన్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (23), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు సాధించారు.

అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ (45), జోస్‌ బట్లర్‌ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్‌ జాక్స్‌ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్‌), హ్యారీ బ్రూక్‌ (17 నాటౌట్‌) ఇంగ్లండ్‌ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.

ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికగా రేపటి నుంచి టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్‌, ఇంగ్లండ్‌ జట్లు వేర్వేరే గ్రూప్‌ల్లో ఉన్నాయి. పాక్‌.. భారత్‌తో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడనుండగా.. ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో పాటు గ్రూప్‌-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ల మెగా సమరం జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement