T20 WC 2021: బట్లర్‌ ఊచకోత.. ఇంగ్లండ్‌ దర్జాగా సెమీస్‌కు | England Beat Sri Lanka By 26 Runs Enter Semifinal T20 World Cup 2021 | Sakshi
Sakshi News home page

T20 WC 2021 ENG Vs SL: బట్లర్‌ ఊచకోత.. ఇంగ్లండ్‌ దర్జాగా సెమీస్‌కు

Published Tue, Nov 2 2021 7:31 AM | Last Updated on Tue, Nov 2 2021 8:30 AM

England Beat Sri Lanka By 26 Runs Enter Semifinal T20 World Cup 2021 - Sakshi

England Beat Sri Lanka By 26 Runs Enter Semifinal T20 WC 2021.. నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు... ఎదురులేని ఆటతో చెలరేగుతున్న ఇంగ్లండ్‌ మరో గెలుపుతో అధికారికంగా టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బట్లర్‌ మెరుపు శతకంతో ఇంగ్లండ్‌కు మంచి స్కోరు అందించగా... అనంతరం బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సమష్టిగా సఫలమయ్యారు. సోమవారం జరిగిన గ్రూప్‌–1 సూపర్‌–12 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 26 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా  ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (67 బంతుల్లో 101 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఈ టోర్నీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలవగా... కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (36 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం లంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. హసరంగ (21 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్, జోర్డాన్‌ రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.  

చదవండి: టి20 ప్రపంచకప్‌ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్‌

రాణించిన మోర్గాన్‌... 
పవర్‌ప్లేలో 36 పరుగులు... సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 47 పరుగులే... తర్వాతి 4 ఓవర్లలో 36 పరుగులు రాబట్టి కొంత ఊపు... ఆపై చివరి 6 ఓవర్లలో ఏకంగా 83 పరుగులు! ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఇలా వేర్వేరు దశలుగా సాగింది. ఆరు ఓవర్లలోపే ఆ జట్టు జేసన్‌ రాయ్‌ (9), మలాన్‌ (6), బెయిర్‌స్టో (0) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో బట్లర్, మోర్గాన్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడం కష్టంగా మారిపోగా, ఇద్దరు బ్యాటర్లు కూడా అనవసరపు దూకుడు ప్రదర్శించకుండా సంయమనంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. సుదీర్ఘ కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మోర్గాన్‌ కూడా తడబడుతూనే బ్యాటింగ్‌ చేశాడు. ఒకదశలో 21 బంతుల్లో అతను 10 పరుగులే చేశాడు. ఎట్టకేలకు తాను ఎదుర్కొన్న 22వ బంతికి తొలి ఫోర్‌ కొట్టిన కెప్టెన్‌... ఆ తర్వాత కాస్త ధాటిని ప్రదర్శించి బంతులు, పరుగుల లెక్కను సమం చేశాడు.  

బట్లర్‌ సూపర్‌... 
గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అజేయంగా 71 పరుగులు చేసిన బట్లర్‌ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. పరిస్థితిని బట్టి అతను కూడా ఆరంభంలో నెమ్మదిగా ఆడినా చివర్లో చెలరేగిపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో జాగ్రత్తపడి పేసర్లపై సత్తా చాటాడు. కరుణరత్నే ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్‌ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి హాఫ్‌ సెంచరీకి అతనికి కేవలం 22 బంతులే సరిపోయాయి. కుమార ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన బట్లర్, ఆపై షనక ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతి వేయడానికి ముందు 95 వద్ద నిలిచిన అతను... ఆఖరి బంతిని స్క్వేర్‌ లెగ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాది టి20 కెరీర్‌లో తొలి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ బౌలింగ్‌లో 24 బంతులు ఆడి 12 పరుగులే చేసిన బట్లర్, పేసర్ల బౌలింగ్‌లో 43 బంతుల్లో 89 పరుగులు బాదాడంటే అతని వ్యూహం ఎలాంటిదో అర్థమవుతుంది.  

చదవండి: T20 WC 2021: కోహ్లికి జట్టు నుంచి సపోర్ట్‌ లేదా?!

కీలక భాగస్వామ్యం... 
ఛేదనలో లంక కూడా తడబడింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు నిసాంక (1), అసలంక (21), కుశాల్‌ పెరీరా (7) వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఆపై అవిష్క (13), రాజపక్స (26) కూడా అవుట్‌ కావడంతో 76 వద్దే సగం జట్టు పెవిలియన్‌ చేరింది. భారీ ఓటమి ఖాయమనుకున్న ఈ దశలో హసరంగ, షనక (26; 2 ఫోర్లు, సిక్స్‌) పోరాడారు. దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే 53 పరుగులు జోడించడంతో లంక విజయంపై ఆశలు రేగాయి. అయితే రాయ్, బిల్లింగ్స్‌ ‘ర్యాలీ’ క్యాచ్‌తో హసరంగ అవుట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. 14 బంతుల వ్యవధిలో 8 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోయి లంక పరాజయంపాలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement