తన రూటే సపరేటు... | England captain Joe Root prepares for 100th Test of his career | Sakshi
Sakshi News home page

తన రూటే సపరేటు...

Published Thu, Feb 4 2021 4:58 AM | Last Updated on Thu, Feb 4 2021 5:11 AM

England captain Joe Root prepares for 100th Test of his career - Sakshi

సుమారు ఎనిమిదేళ్ల క్రితం... ఇంగ్లండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయిన ఆ కుర్రాడు చివరి టెస్టులో బరిలోకి దిగాడు. నెమ్మదైన పిచ్‌పై టీమిండియా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ 229 బంతులు ఆడిన అతను అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత గడ్డపై తొలి మ్యాచ్‌లోనే అతను కనబర్చిన పట్టుదల చూసి ఇంగ్లండ్‌ భవిష్యత్తు తార అంటూ ప్రశంసలు కురిశాయి. తర్వాతి రోజుల్లో తనపై అంచనాలను నిలబెట్టుకుంటూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడిగా ఎదిగిన ఆ కుర్రాడే జోసెఫ్‌ ఎడ్వర్డ్‌ రూట్‌... నాగపూర్‌లో మొదలైన రూట్‌ ప్రస్థానం ఇప్పుడు చెన్నైలో వందో టెస్టు వరకు చేరింది. ఈతరం ఫ్యాబ్‌–4లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రూట్‌ అందరికంటే ముందుగా టెస్టు మ్యాచ్‌ల సెంచరీ మైలురాయిని చేరుకోవడం విశేషం.

సాక్షి క్రీడా విభాగం
భారీగా పరుగుల వరద పారించి ఒకే సిరీస్‌తో స్టార్‌గా మారిపోయిన రికార్డు అతనికి లేదు. రూట్‌ పేరు చెప్పగానే విధ్వంసక ఇన్నింగ్స్‌లు గానీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రదర్శనలు గానీ సగటు క్రికెట్‌ అభిమానికి గుర్తుకు రావు. అయినా సరే రూట్‌ సాధించిన ఘనతలు అతని విలువేమిటో చెబుతాయి. అతని కెరీర్‌ గ్రాఫ్‌ ఆసాంతం ఒకే రీతిలో, నిలకడగా సాగిపోయింది. క్రీజ్‌లో సుదీర్ఘ సమయం నిలిచే పట్టుదల, ఏకాగ్రత, ఓపిక, చూడచక్కటి కళాత్మక షాట్‌లు ... ఇలా సగటు టెస్టు బ్యాట్స్‌మన్‌కు కావాల్సిన లక్షణాలన్నీ రూట్‌లో ఉన్నాయి. మెరుపు షాట్లు లేకపోయినా... చూస్తుండగానే చకచకా పరుగులు రాబట్టగలిగే శైలితోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో రూట్‌ 19 సెంచరీలు చేస్తే ఇంగ్లండ్‌ ఒక్కసారి కూడా ఓడిపోలేదంటే (15 విజయాలు, 4 ‘డ్రా’) జట్టులో అతని ప్రాధాన్యత అర్థమవుతుంది.

వైఫల్యాల నుంచి...
కెరీర్‌ ఆరంభంలో రూట్‌కు ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌ చేసే అవకాశాలు వచ్చాయి. అదే స్థానంలో తన సొంత మైదానం హెడింగ్లీలో సెంచరీ అనంతరం అతని ప్రదర్శనను చూసిన ఇంగ్లండ్‌ సెలక్టర్లు ఓపెనర్‌గా అవకాశాలు ఇచ్చారు. అయితే 2013–14లో ఆసీస్‌ గడ్డపై జరిగిన యాషెస్‌ సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. చివరి టెస్టులో అతనికి చోటు కూడా దక్కలేదు. అయితే కొద్ది రోజులకే లార్డ్స్‌ మైదానంలో శ్రీలంకపై చేసిన సెంచరీతో రూట్‌ కెరీర్‌ మలుపు తిరిగింది. తర్వాతి ఏడాదే భారత్‌పై చేసిన రెండు సెంచరీలతో రూట్‌ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌ బోర్డుతో గొడవల అనంతరం కెవిన్‌ పీటర్సన్‌ కెరీర్‌ అనూహ్యంగా ముగిసిపోవడంతో ఆ స్థానాన్ని ఆక్రమించిన అతను జట్టులో పాతుకుపోయాడు. 2015 ఏడాదిలో టెస్టుల్లో 1,385 పరుగులు చేయడం రూట్‌ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. అతడిని ఐసీసీ బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ను కూడా చేసింది.  

ఉపఖండంలోనూ...
సాధారణంగా ఇంగ్లండ్‌ క్రికెటర్లకు ఆసియా దేశాల్లో పేలవ రికార్డు ఉంటుంది. అయితే స్పిన్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం ఉన్న రూట్‌ దీనికి భిన్నం. ముఖ్యంగా స్వీప్‌ షాట్‌ రూట్‌కు ఉపఖండంలో భారీగా పరుగులు తెచ్చి పెట్టింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 2 టెస్టుల్లోనే చేసిన 426 పరుగులు అతని సామర్థ్యాన్ని చూపించాయి. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో ఆసియా ఖండం లో అందరికంటే ఎక్కువ సగటు రూట్‌ (54.13)దే కాగా, కనీసం 8 వేల పరుగులు చేసిన వారిలో కూడా అతనే అత్యుత్తమం. కెరీర్‌లో 99 టెస్టుల తర్వాత చూస్తే రూట్‌ చేసినన్ని పరుగులు మరే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ కూడా చేయలేదు. 2016లో భారత గడ్డపై ఇంగ్లండ్‌ జట్టు 0–4తో చిత్తుగా ఓడిన సిరీస్‌లోనూ 49.10 సగటుతో 491 పరుగులు చేసిన రూట్‌ జట్టు తరఫున టాప్‌స్కోరర్‌గా నిలిచి తన సత్తా ఏమిటో చూపించాడు. ఇదే సిరీస్‌ తర్వాత రూట్‌ ఇంగ్లండ్‌ 80వ టెస్టు కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందాడు.

వారితో పోలిస్తే...
ఫ్యాబ్‌–4లో సహజంగానే కోహ్లి, స్మిత్, విలియమ్సన్‌లతో రూట్‌కు పోలిక ఉంటోంది. అయితే గణాంకాలపరంగా చూస్తే ఈ ముగ్గురికంటే అతను ఒకింత వెనుకబడినట్లే అనిపిస్తోంది. సాధించిన సెంచరీల సంఖ్య, సగటులో స్మిత్‌ (61.80/27), విలియమ్సన్‌ (54.31/24), కోహ్లి (53.41/27)లతో పోలిస్తే రూట్‌ (49.39/19) రికార్డు గొప్పగా కనిపించదు. కానీ ఇంగ్లండ్‌ క్రికెట్‌కు సంబంధించి అతను సాధించిన రికార్డులు మాత్రం అతడిని ఆ దేశపు బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ జాబితాలో నిలబెట్టాయి. ప్రస్తుతం 30 ఏళ్ల వయసు, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా టెస్టుకు దూరం కాని ఫిట్‌నెస్, ఇంగ్లండ్‌ జట్టు ఎక్కువ సంఖ్యలో ఆడే టెస్టులు... ఇవన్నీ చూస్తే ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగుల అలిస్టర్‌ కుక్‌ (12,472 పరుగులు) రికార్డును రూట్‌ (8,249) తొందరలోనే అందుకోగలడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement