గ్రాహమ్ థోర్ప్ (PC: ICC)
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్‌ది సహజ మరణం కాదని అతడి భార్య అమెండా తెలిపారు. శారీరక, మానసిక సమస్యలతో పోరాడలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని విచారం వ్యక్తం చేశారు. తనను ప్రేమించే, తాను ప్రేమించే భార్యాపిల్లలు ఉన్నా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒత్తిడిని అధిగమించలేకే తమకు శాశ్వతంగా దూరమైపోయాడని ఉద్వేగానికి గురయ్యారు.
కాగా 55 ఏళ్ల థోర్ప్ మరణవార్త ఆగష్టు 5న వెల్లడైంది. 2022లో అఫ్గానిస్తాన్‌కు హెడ్ కోచ్‌గా నియమితుడైన థోర్ప్.. అప్పటి నుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అయితే స్పష్టమైన వ్యాధి, ఏ రకమైన అనారోగ్యమన్న సంగతి మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా... ఆయన భార్య అమెండా వ్యాఖ్యలతో థోర్ప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం బయటకు వచ్చింది.
‘ది టైమ్స్’తో అమెండా మాట్లాడుతూ.. ‘‘తను మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడు. మేము కూడా అతడిపై ప్రేమను కురిపించేవాళ్లం. గత కొన్నాళ్లుగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసేందుకు మేమెంతగానో ప్రయత్నించాం. కానీ తను శారీరక, మానసిక సమస్యలతో పోరాడలేక విసుగుచెందాడు.
అందుకే తనను తాను అంతం చేసుకున్నాడు. గత రెండేళ్లుగా అతడు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 2022లో తొలిసారి ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత కాస్త తేలికపడ్డా.. మళ్లీ ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఈసారి మాత్రం కోలుకోలేకపోయాడు. మెరుగైన చికిత్స అందించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అతడిని కాపాడుకోలేకపోయాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక థోర్ప్ కుమార్తె కిట్టీ మాట్లాడుతూ.. ‘‘జీవితాన్ని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి.. కానీ ఇలా చేశారు. ఆయన అలా ఒత్తిడిలో కుంగిపోతే చూసి మా గుండె పగిలిపోయింది. నాన్న శరీరంలో వేరే ఎవరో చొరబడి ఇలా చేసారేమో అన్నంత బాధ కలుగుతోంది. నాన్న చాలా మంచివారు. ఆయన మరణవార్త తెలియగానే చాలా మంది స్పందించారు. అందుకు మాకు కాస్త సంతోషంగా అనిపించింది. ఆయనను గుర్తుపెట్టుకున్న వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొంది.
కాగా ఎడంచేతి బ్యాటర్ అయిన థోర్ప్ 1993 నుంచి 2005 వరకు తన కెరీర్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్ జట్టులో కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలందించాడు. 100 టెస్టులు ఆడిన థోర్ప్ 44.66 సగటుతో 6,744 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలున్నాయి. 82 అంతర్జాతీయ వన్డేలు ఆడి 37.18 సగటుతో 2,830 పరుగులు సాధించాడు. కౌంటీ జట్టు సర్రేతో థోర్ప్‌ది సుదీర్ఘబంధం! అండర్–11 స్థాయిలోనే ఆ జట్టులో చేరిన థోర్ప్ ఏకంగా 17 ఏళ్ల పాటు సేవలందించి దాదాపు 20 వేల పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ ముగిశాక కోచ్‌గానూ పని చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment