England Tour Of Pakistan In Doubt : పాకిస్థాన్ క్రికెట్‌కు గంటల వ్యవధిలో మరో షాక్ తగిలింది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డేకు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించగా, త్వరలో పాక్‌లో పర్యటించాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సైతం కివీస్ బాటలోనే పయనించాలని నిర్ణయించుకుంది. పాకిస్థాన్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశాక పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
కాగా, ఇంగ్లండ్ జట్టు చివరిసారి 2005లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాక్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే నెలలో ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే, న్యూజిలాండ్ తాజా నిర్ణయంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా పునరాలోచనలో పడింది. న్యూజిలాండ్ నిర్ణయం గురించి తమకు తెలిసిందని, ఆ జట్టు అక్కడే ఉంది కాబట్టి అక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంటుందని ఈసీబీ పేర్కొంది. ఇదిలా ఉంటే, పాక్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా తొలి వన్డే జరగాల్సింది.
చదవండి: మరికాసేపట్లో వన్డే మొదలు.. పాక్ సిరీస్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment