Ashes Series 2023: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ బృందం చిత్తైన విషయం తెలిసిందే. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుబడింది. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించి స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లలో బోల్తా పడిన ఇంగ్లండ్‌కు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు.
ఓలీ పోప్
దీంతో మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్. కుడి భుజం నొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ అతడు మిగిలిన మ్యాచ్‌లలో అందుబాటులో ఉండడని పేర్కొంది.
ఈ మేరకు.. ‘‘లండన్‌లో స్కానింగ్ చేయించగా.. అతడి గాయం మరింత తీవ్రతరమైందని తేలింది. సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు’’ అని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఓలీ పోప్ చికిత్స పొందుతాడని వెల్లడించింది.
కాగా ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో ఓలీ పోప్.. ఓ మోస్తరుగా రాణించాడు. మొదటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 31, 14 పరుగులు చేసిన వన్‌డౌన్ బ్యాటర్.. రెండో టెస్టులో 42, 3 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రధానులు సైతం పరస్పర విమర్శలతో తమ జట్లకు అండగా నిలవడం విశేషం.
చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
Comments
Please login to add a commentAdd a comment