సౌతాంప్టన్: విజయానికి 35 బంతుల్లో 39 పరుగులు చేయాలి... చేతిలో 9 వికెట్లున్నాయి... టి20ల్లో ఏ జట్టుకైనా ఇది సులువైన లక్ష్యం. అదీ ఆస్ట్రేలియాలాంటి అగ్రశ్రేణి జట్టయితే ఆడుతూ పాడుతూ పని పూర్తి చేయాలి. కానీ ఇంగ్లండ్‌తో ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆసీస్ మాత్రం ఇలాంటి స్థితి నుంచి కూడా మ్యాచ్‌ను చేజార్చుకుంది. 14 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. చివరకు ఆస్ట్రేలియా 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మలాన్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, జాస్ బట్లర్ (29 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (47 బంతుల్లో 58; 4 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు, సిక్స్)ల జోరు చూస్తే సునాయాస విజయం ఖాయమనిపించింది. వీరిద్దరు 11 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఒక దశలో ఆసీస్ స్కోరు వికెట్ నష్టానికి 124 పరుగుల వద్ద నిలిచింది. అయితే 9 పరుగుల వ్యవధిలో స్మిత్ (18), మ్యాక్స్‌వెల్ (1), వార్నర్, క్యారీ (1) అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టిపడేయడంతో 5.4 ఓవర్ల పాటు ఆ జట్టు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. టామ్ కరన్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... ఆరు బంతులూ ఆడిన స్టొయినిస్ ఒక సిక్సర్ సహా 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లను నిర్వహిస్తుండటంతో బ్యాట్స్‌మెన్ కొట్టిన సిక్స్‌లకు బంతి గ్యాలరీల్లోకి పడితే ఆటగాళ్లే బంతిని వెతికి మరీ తెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment