
మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... లబ్‌షేన్ (48; 3 ఫోర్లు), క్యారీ (36; 2 ఫోర్లు) రాణించారు. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా... ఫించ్, లబ్‌షేన్ మూడో వికెట్‌కు 107 పరుగులు సాధించడంతో జట్టు గెలుపు దిశగా సాగింది.
అయితే లబ్‌షేన్‌ను వోక్స్ అవుట్ చేశాక జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 21 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన కంగారూలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. 65 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లు కోల్పోయి ఆ జట్టు ఓటమి పాలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్చర్ (3/34), వోక్స్ (3/32), స్యామ్ కరన్ (3/35) ప్రత్యర్థిని పడగొట్టారు. అంతకు ముందు ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌లు సిరీస్‌లో రెండు జట్లు ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా మూడో వన్డే రేపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment