యూరోప్‌ జట్టుదే లేవర్‌ కప్‌ | Europe Team won Laver Cup | Sakshi
Sakshi News home page

యూరోప్‌ జట్టుదే లేవర్‌ కప్‌

Published Tue, Sep 24 2024 4:40 AM | Last Updated on Tue, Sep 24 2024 4:40 AM

Europe Team won Laver Cup

వరల్డ్‌ టీమ్‌పై 13–11 పాయింట్లతో విజయం

 బెర్లిన్‌: రెండేళ్ల తర్వాత లేవర్‌ కప్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో యూరోప్‌ జట్టు విజేతగా నిలిచింది. వరల్డ్‌ టీమ్‌తో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో యూరోప్‌ జట్టు 13–11 పాయింట్ల తేడాతో వరల్డ్‌ టీమ్‌ జట్టును ఓడించి ఐదోసారి విన్నర్స్‌ ట్రోఫీని దక్కించుకుంది. యూరోప్‌ జట్టు తరఫున అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా), కాస్పర్‌ రూడ్‌ (నార్వే), దిమిత్రోవ్‌ (బల్గేరియా), సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఫ్లావియో కొబోలి (ఇటలీ), జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ) బరిలోకి దిగారు. 

జాన్‌ బోర్గ్‌ (స్వీడన్‌) కెప్టెన్‌గా, థామస్‌ ఎన్‌క్విస్ట్‌ (స్వీడన్‌) వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. వరల్డ్‌ టీమ్‌ తరఫున టేలర్‌ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్‌ టియాఫో, బెన్‌ షెల్టన్‌ (అమెరికా), అలెజాంద్రో తబిలో (చిలీ), ఫ్రాన్సిస్సో సెరున్‌డొలో (అర్జెంటీనా), థనాసి కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. జాన్‌ మెకన్రో (అమెరికా) కెపె్టన్‌గా, ప్యాట్రిక్‌ మెకన్రో (అమెరికా) వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు.  

రోజుకు మూడు చొప్పున మొత్తం తొమ్మిది సింగిల్స్‌ మ్యాచ్‌లు... రోజుకు ఒక డబుల్స్‌ మ్యాచ్‌ చొప్పున మొత్తం  మూడు డబుల్స్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. తొలి రోజు మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు 1 పాయింట్‌... రెండో రోజు మ్యాచ్‌లో నెగ్గిన ప్లేయర్‌కు 2 పాయింట్లు... మూడో రోజు మ్యాచ్‌లో విజయం సాధించిన ప్లేయర్‌కు 3 పాయింట్లు కేటాయించారు. తొలుత 13 పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. 

రెండు రోజుల మ్యాచ్‌ల తర్వాత వరల్డ్‌ టీమ్‌ 8–4 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరిరోజు యూరోప్‌ జట్టు మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి 9 పాయింట్లు సాధించగా... వరల్డ్‌ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి 3 పాయింట్లు సంపాదించింది. ఓవరాల్‌గా యూరోప్‌ జట్టు 13–11తో విజయాన్ని దక్కించుకుంది. ఆఖరి రోజు డబుల్స్‌ మ్యాచ్‌లో కార్లోస్‌ అల్‌కరాజ్‌–కాస్పర్‌ రూడ్‌ (యూరోప్‌) జోడీ 6–2, 7–6 (8/6)తో బెన్‌ షెల్టన్‌–ఫ్రానెŠస్‌స్‌ టియాఫో (వరల్డ్‌) జంటను ఓడించింది. 

తొలి సింగిల్స్‌లో బెన్‌ షెల్టన్‌ (వరల్డ్‌) 6–7 (6/8), 7–5, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో డానిల్‌ మెద్వెదెవ్‌ (యూరోప్‌)పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (యూరోప్‌) 6–7 (5/7), 7–5, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టియాఫో (వరల్డ్‌)ను ఓడించాడు. మూడో సింగిల్స్‌లో అల్‌కరాజ్‌ (యూరోప్‌) 6–2, 7–5తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (వరల్డ్‌)పై నెగ్గడంతో యూరోప్‌ జట్టుకు టైటిల్‌ ఖరారైంది. విజేత జట్టులోని ప్రతి సభ్యుడికి 2,50,000 డాలర్ల (రూ. 2 కోట్ల 8 లక్షలు) చొప్పున, రన్నరప్‌ జట్టులోని ప్రతి సభ్యుడికి 1,25,000 డాలర్ల  (రూ. 1 కోటీ 4 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.  

ఆ్రస్టేలియా దిగ్గజ క్రీడాకారుడు రాడ్‌ లేవర్‌ పేరిట 2017 నుంచి ప్రతి ఏడాది ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. యూరోప్‌ దేశాలకు చెందిన మేటి టెన్నిస్‌ ప్లేయర్లతో ఒక జట్టు... యూరోపేతర దేశాలకు చెందిన స్టార్‌ ఆటగాళ్లతో మరో జట్టు ఈ టోర్నీలో పోటీపడతాయి. 2017, 2018, 2019లలో వరుసగా మూడేళ్లు యూరోప్‌ జట్టు టైటిల్‌ నెగ్గి హ్యాట్రిక్‌ సాధించింది. కరోనా కారణంగా 2020లో ఈ టోర్నీని నిర్వహించలేదు. 2021లోనూ యూరోప్‌ జట్టుకే టైటిల్‌ లభించింది. 2022, 2023లలో వరల్డ్‌ టీమ్‌ జట్టు విజేతగా నిలిచింది.  

టైటిల్‌ పోరుకు విజయ్‌–జీవన్‌ జోడీ
హాంగ్జూ (చైనా): భారత సీనియర్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ తన కెరీర్‌లో తొలిసారి అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన జీవన్‌ నెడుంజెళియన్‌తో కలిసి హాంగ్జూ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్‌ విభాగంలో విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు.

సోమవారం జరిగిన సెమీఫైనల్లో 37 ఏళ్ల విజయ్, 35 ఏళ్ల జీవన్‌ 0–6, 6–2, 10–4తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఏరియల్‌ బెహర్‌ (ఉరుగ్వే)–రాబర్ట్‌ గాలోవే (అమెరికా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో కాన్‌స్టాన్‌టిన్‌ ఫ్రాంట్‌జెన్‌–హెండ్రిక్‌ జెబెన్స్‌ (జర్మనీ) ద్వయంతో విజయ్‌–జీవన్‌ జంట తలపడుతుంది.  

71 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్‌లో ఒక్క గేమ్‌ కూడా నెగ్గలేకపోయిన విజయ్‌–జీవన్‌ ద్వయం రెండో సెట్‌లో తేరుకుంది. రెండు సార్లు ప్రత్యర్థి జోడీ సర్విస్‌ను బ్రేక్‌ చేసి తమ సర్విస్‌లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక ‘సూపర్‌ టైబ్రేక్‌’లో భారత జోడీ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది.

విజయ్‌ కెరీర్‌లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ ఫైనల్‌కాగా... జీవన్‌కిది నాలుగో ఫైనల్‌. 2017లో రోహన్‌ బోపన్నతో కలిసి జీవన్‌ చెన్నై ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్‌ గెలిచాడు. 2018లో ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా)తో కలిసి చెంగ్డూ ఓపెన్‌లో, 2023లో శ్రీరామ్‌ బాలాజీతో కలిసి పుణే ఓపెన్‌లో జీవన్‌ రన్నరప్‌ ట్రోఫీని సాధించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement