జెనీవా (స్విట్జర్లాండ్): ప్రతి యేటా మేటి టెన్నిస్ ఆటగాళ్ల మధ్య నిర్వహిస్తున్న లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో యూరోప్ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించింది. రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), సిట్సిపాస్ (గ్రీస్), ఫాగ్‌నిని (ఇటలీ), బాటిస్టా అగుట్ (స్పెయిన్)లతో కూడిన యూరోప్ జట్టు 13–11తో వరల్డ్ టీమ్‌పై విజయం సాధించింది.
వరల్డ్ టీమ్‌లో జాన్ ఇస్నెర్ (అమెరికా), మిలోస్ రావ్‌నిచ్ (కెనడా), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), షపోవలోవ్ (కెనడా), జాక్ సోక్ (అమెరికా), జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) సభ్యులుగా ఉన్నారు. నిర్ణాయక చివరి సింగిల్స్ మ్యాచ్‌లో యూరోప్ జట్టు ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 3–6, 10–4తో రావ్‌నిచ్ (వరల్డ్ టీమ్)పై నెగ్గి తన జట్టుకు కప్ అందించాడు. మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొమ్మిది సింగిల్స్ విభాగంలో, మూడు డబుల్స్ విభాగంలో నిర్వహించారు. తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన వారికి ఒక్కో పాయింట్, రెండో రోజు రెండు పాయింట్లు, మూడో రోజు మూడు పాయింట్ల చొప్పున కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment