IPL 2023: Fans Says Coach Ashish Nehra Behind-Vijay Shankar Massive Batting Change - Sakshi
Sakshi News home page

#VijayShankar: ఎంత మార్పు.. అంతా నెహ్రా చలవేనట!

Published Sun, Apr 9 2023 6:05 PM | Last Updated on Sun, Apr 9 2023 6:27 PM

Fans Says Coach Ashish Nehra Behind-Vijay Shankar Massive Batting Change - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ మంచి జోరుమీద ఉన్నాడు. గత సీజన్‌లకు భిన్నంగా అతని బ్యాటింగ్‌ సాగుతుంది. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ పూనకం వచ్చినట్లుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ అందుకున్న విజయ్‌ శంకర్‌ ఓవరాల్‌గా 24 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.


Photo: IPL Twitter

అయితే ఒకప్పుడు విజయ్‌ శంకర్‌ వేరు. క్రీజులో కుదురుకునే వరకు బంతులు తింటాడనే పేరు బలంగా వినిపించేది. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌లో ఉ‍న్నప్పుడు విజయ్‌ శంకర్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా మెరిసింది లేదు. టీమిండియాలోకి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.  అలా అని అతనిలో టాలెంట్‌ లేదని కాదు.. ఉంది కానీ బయటపెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. పైగా త్రీడీ ప్లేయర్‌ అంటూ అందరు అతన్ని ట్రోల్‌ చేసేవారు. 

అంతలా ట్రోల్స్‌ బారిన పడ్డ విజయ్‌ శంకర్‌ ఈ సీజన్‌లో మాత్రం కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తన ఇంపాక్ట్‌ను బలంగా చూపించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎలా ఆడినా.. ఇవాళ కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం తన బ్యాటింగ్‌ పవర్‌ను ప్రదర్శించాడు విజయ్‌ శంకర్‌.


Photo: IPL Twitter

మరి ఇంతలా విజయ్‌ శంకర్‌ బ్యాటింగ్‌ మారడానికి కారణం గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రానే అని అభిమానులు ట్విటర్‌లో పేర్కొన్నారు. నిజానికి గత సీజన్‌లోనే విజయ్‌ శంకర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. విజయ్‌ శంకర్‌ను కొనుగోలు చేయడం వెనుకు పరోక్షంగా నెహ్రా హస్తం ఉన్నట్లు తేలింది. గత సీజన్‌లో అక్కడక్కడా మెరిసిన విజయ్‌ శంకర్‌ను కరెక్ట్‌గా వాడితే ప్రయోజనం ఉంటుందని కోచ్‌ నెహ్రా నమ్మాడు. అందుకు తగ్గట్లే విజయ్‌ శంకర్‌ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 

గతేడాది మినీ వేలానికి ముందు విజయ్‌ శంకర్‌ను రిటైన్‌ చేసుకున్న తర్వాత ఒక మీడియా సమావేశంలో ఆశిష్‌ నెహ్రా మాట్లాడాడు.'' విజయ్‌ శంకర్‌ను వెనుకేసుకు రావడానికి ఒక కారణం ఉంది. అతను టీమిండియాకు ఆడాడు. అతనిలో ఏదో తెలియని టాలెంట్‌ దాగుంది. దానిని వెలికితీయాలనుకుంటున్నా.. అవకాశాలు ఇస్తేనే కదా తెలిసేది.. ఏదో ఒకరోజు తనను తాను నిరూపించుకుంటాడు.. ఆ నమ్మకం నాకుంది.. అంటూ పేర్కొన్నాడు. తాజాగా ఆశిష్‌ నెహ్రా వ్యాఖ్యలు నిజమయ్యాయి

ఇక తొలి ఇన్నింగ్స్‌ అనంతరం విజయ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ''ఈ సీజన్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. కొందరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నా. గతేడాది నాకు కలిసి రాలేదు. కానీ ఈ ఏడాది డొమొస్టిక్‌ సీజన్‌లో చాలా పరుగులు చేశాను. ఫ్రాంచైజీ నన్ను రిటైన్‌ చేసుకోవడంతోనే వారు నాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారని అర్థమైంది. ఒకప్పుడు వరల్డ్‌కప్‌లో గాయపడిన నేను ఆ తర్వాత ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమయ్యాను.

ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి తిరిగి వస్తాననేది చెప్పలేను. అవకాశమొస్తే మాత్రం వదులుకోను. ఇక కోచ్‌ ఆశిష్‌ నెహ్రా మద్దతు నాకు చాలా ఉంది. అతను నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా గత ఐపీఎల్‌ తర్వాత నాకు సర్జరీ అయింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దేశవాలీ క్రికెట్‌లో రాణించి మళ్లీ ఫామ్‌ను అందుకున్నా'' అంటూ ముగించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement