FIFA WC 2022 1st Semi Final: Argentina Vs Croatia Head-To-Head Stat, Strengths And Weakness - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ఇదే ఆఖరి ఛాన్స్‌! క్రొయేషియా తక్కువేమీ కాదు! అదే జరిగితే మెస్సీ కూడా రొనాల్డోలాగే..

Published Tue, Dec 13 2022 8:34 AM | Last Updated on Tue, Dec 13 2022 9:55 AM

FIFA WC 2022 1st Semi Final: Argentina Vs Croatia H2H Strength Weakness - Sakshi

మెస్సీ- మోడ్రిచ్‌

Argentina Vs Croatia- Lionel Messi- Doha: మెస్సీ మరోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేరుస్తాడా? మోడ్రిచ్‌ వరుసగా రెండోసారి తమ జట్టును తుది పోరు వరకు తీసుకెళ్లగలడా? ఒకరు ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని తన జట్టుకు బలంగా నిలవగా... మరోవైపు సమష్టితత్వాన్నే నమ్ముకొని ముందుకు సాగిపోయిన టీమ్‌ మళ్లీ అంచనాలను తలకిందులు చేయగలదా? ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీ-2022లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది.  

సంచలనాలు కొత్త కాదు
రెండుసార్లు విజేత అర్జెంటీనా, గత వరల్డ్‌కప్‌ ఫైనలిస్ట్‌ క్రొయేషియా మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ తొలి సెమీఫైనల్లో తలపడతాయి. 2014 వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలోనే అర్జెంటీనా ఫైనల్‌ చేరగా, మోడ్రిచ్‌ నాయకత్వంలోనే 2018లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది. అంచనాలు ఇప్పటికీ అర్జెంటీనాకు అనుకూలంగానే ఉండగా... క్రొయేషియాకు సంచలనాలు కొత్త కాదు.

చెరోసారి.. అయితే!
ఈ రెండు జట్లు గతంలో రెండుసార్లు ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో ముఖాముఖిగా తలపడ్డాయి. 1998లో అర్జెంటీనా 1–0తో నెగ్గగా... 2018లో క్రొయేషియా  3–0తో గెలిచింది. నాకౌట్‌ దశలో మాత్రం తొలిసారి ఈ రెండు జట్లు ‘ఢీ’కొంటున్నాయి. 

స్టార్‌ ముందుండి నడిపిస్తుండగా... 
తన కెరీర్‌లో వరల్డ్‌కప్‌ లేని లోటును పూరించేందుకు, అభిమానుల దృష్టిలో మరో మారడోనాగా మారేందుకు మెస్సీకి ఇది చివరి చాన్స్‌. 35 ఏళ్ల వయసులో కూడా అతని అద్భుత ప్రదర్శన జట్టును సెమీస్‌ వరకు తీసుకొచ్చింది.

సమకాలీన మేటి ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డోకు సాధ్యం కానిది సాధించగలిగే అవకాశం మెస్సీ ముంగిట నిలిచింది. నిజానికి మెక్సికో, ఆస్ట్రేలియాలపై చేసిన గోల్స్‌తో పాటు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నాహుల్‌ మొలినాకు మెస్సీ ఇచ్చిన రివర్స్‌ పాస్‌ మొత్తం వరల్డ్‌కప్‌లోనే హైలైట్‌గా నిలిచాయి.

అయితే మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లు అంతంతమాత్రంగానే రాణించారు. అల్వారెజ్, ఫెర్నాండెజ్, మ్యాక్‌ అలిస్టర్‌ ఫర్వాలేదనిపించినా ప్రపంచ స్థాయి ప్రదర్శన మాత్రం రాలేదు. ఇప్పటి వరకు అర్జెంటీనా ఆటలో ఆశించిన వేగం, కొత్తదనం కనిపించకపోయినా నడిచిపోయింది.

కాస్త ఏమరుపాటుగా ఉన్నా
కానీ సెమీస్‌ వేదికపై కాస్త ఏమరుపాటుగా ఉన్నా క్రొయేషియా మ్యాచ్‌ను లాగేసుకోగలదు. మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లను కోచ్‌ స్కలోని ఎంత సమర్థంగా వాడుకుంటాడనేది కీలకం. గోల్‌కీపర్‌ మార్టినెజ్‌పై అదనపు బాధ్యత ఉంది. క్రొయేషియా గోల్‌ కీపర్‌ లివకోవిచ్‌ మెరుపు నైపుణ్యంతో టోర్నీని శాసిస్తున్న తీరు చూస్తే... ఒకవేళ మ్యాచ్‌ పెనాల్టీల వరకు వెళితే మాత్రం మార్టినెజ్‌ అత్యద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.   

పోరాటతత్వమే బలంగా... 
బ్రెజిల్‌పై క్వార్టర్‌ ఫైనల్లో గెలిచిన తర్వాత చివరి వరకు ఓటమిని అంగీకరించని తమ పోరాటస్ఫూర్తి గుర్తించి క్రొయేషియా కోచ్‌ డాలిచ్‌ పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. గణాంకాల్లో అది కనిపించకపోయినా అదే వారి విజయ రహస్యమనేది వాస్తవం. సుదీర్ఘ సమయం పాటు బంతిని తమ అదుపులో ఉంచుకోగల మిడ్‌ఫీల్డర్లు మోడ్రిచ్, కొవాసిచ్, బ్రొజొవిచ్‌ జట్టు ప్రధాన బలం.

దీనిని బద్దలు కొట్టాలంటే మెస్సీకి కూడా అంత సులువు కాదు. మ్యాచ్‌ సమంగా ఉన్న స్థితిలో దీనిని క్రొయేషియా కొనసాగిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ఎందుకంటే ప్రధాన టోర్నీల్లో క్రొయేషియా ఆడిన గత 9 నాకౌట్‌ మ్యాచ్‌లలో 8 అదనపు సమయం వరకు వెళ్లాయి. ఆపై పెనాల్టీల ద్వారానే ఈ టోర్నీలో జపాన్‌పై, బ్రెజిల్‌పై జట్టు విజయం సాధించింది.

అయితే అర్జెంటీనాతో పోలిస్తే జట్టులో దూకుడు తక్కువ. కెనడాపై మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు 2 ఫీల్డ్‌ గోల్స్‌ మాత్రమే చేయగలిగింది. 2018 ఫైనల్లో ఆ జట్టు ఫ్రాన్స్‌కు తొలి 65 నిమిషాల్లోనే 4 గోల్స్‌ సమర్పించుకుంది. అంటే ఆరంభంలో ప్రత్యర్థి దాడి చేయగలిగితే క్రొయేషియా మళ్లీ కోలుకునే అవకాశాలు తక్కువ. అయితే గోల్‌కీపర్‌ లివకోవిచ్‌ ఈసారి కూడా అడ్డుగోడగా నిలవాలని టీమ్‌ కోరుకుంటోంది.  

గతంలో ఐదుసార్లు
కాగా ప్రపంచకప్‌లో ఆరోసారి ఫైనల్‌ బెర్త్‌పై అర్జెంటీనా గురి పెట్టింది. గతంలో అర్జెంటీనా సెమీఫైనల్‌ చేరిన ఐదు పర్యాయాలు విజయం సాధించి టైటిల్‌ పోరుకు అర్హత పొందింది.  

క్రొయేషియా గెలిస్తే
అర్జెంటీనాపై క్రొయేషియా గెలిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్‌ చేరిన నాలుగో యూరోప్‌ జట్టుగా నిలుస్తుంది. గతంలో ఇటలీ (1934, 1938), నెదర్లాండ్స్‌ (1974, 1978), జర్మనీ (1982, 1986, 1990) మాత్రమే ఈ ఘనత సాధించాయి.

చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే!
క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా
Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్‌ ఎప్పుడంటే!  
IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్‌! ఆల్‌రౌండర్‌ అరంగేట్రం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement