RCB Vs MI: ముంబై ఫటాఫట్‌... | IPL 2024 RCB Vs MI: Mumbai Indians Beat Royal Challengers Bengaluru By 7 Wickets, Check Score Details - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs MI Highlights: ముంబై ఫటాఫట్‌...

Published Fri, Apr 12 2024 4:34 AM | Last Updated on Fri, Apr 12 2024 12:04 PM

Fifth defeat for Bengaluru team - Sakshi

197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించిన హార్దిక్‌ బృందం

ఇషాన్, సూర్యకుమార్‌ల విధ్వంసం

5 వికెట్లతో హడలెత్తించిన బుమ్రా

బెంగళూరు జట్టుకు ఐదో పరాజయం 

ముంబై: ముంబై ఇండియన్స్‌ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై ఘనవిజయం సాధించింది.

అంతకుముందు తొలుత ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, రజత్‌ పటిదార్‌ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించారు. ముంబై బౌలర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.  

కోహ్లి విఫలం 
సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్‌ జాక్స్‌ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్‌ డుప్లెసిస్‌ అండతో పటిదార్‌ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాదిన పటిదార్‌ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు.

మ్యాక్స్‌వెల్‌ (0) ఈ సీజన్‌లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్‌ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్‌ లామ్రోర్‌ (0)లతో పాటు, సౌరవ్‌ (9), వైశాక్‌ (0)లను  బుమ్రా అవుట్‌ చేసినా... దినేశ్‌ కార్తీక్‌ ధనాధన్‌ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది.  

ఇషాన్, సూర్యల తుఫాన్‌తో... 
భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్‌లతో హోరెత్తించారు. ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్‌ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్‌ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్‌ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది.

అదే ఓవర్లో ఇషాన్‌ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్‌ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్‌ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్‌; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు.  

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 3; డుప్లెసిస్‌ (సి) డేవిడ్‌ (బి) బుమ్రా 61; జాక్స్‌ (సి) డేవిడ్‌ (బి) మధ్వాల్‌ 8; పటిదార్‌ (సి) ఇషాన్‌ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్‌వెల్‌ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్‌ 0; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 53; లామ్రోర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్‌ (సి) ఆకాశ్‌ (బి) బుమ్రా 9; వైశాక్‌ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్‌దీప్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్‌: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్‌ 4–0–57–1, శ్రేయస్‌ గోపాల్‌ 4–0–32–1, షెఫర్డ్‌ 2–0–22–0, హార్దిక్‌ 1–0–13–0. 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) కోహ్లి (బి) ఆకాశ్‌దీప్‌ 69; రోహిత్‌ (సి) టాప్లీ (బి) జాక్స్‌ 38; సూర్యకుమార్‌ (సి) మహిపాల్‌ (బి) వైశాక్‌ 52; హార్దిక్‌ (నాటౌట్‌) 21; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్‌: టాప్లీ 3–0–34–0, సిరాజ్‌ 3–0–37–0, ఆకాశ్‌దీప్‌ 3.3–0–55–1, మ్యాక్స్‌వెల్‌ 1–0–17–0, వైశాక్‌ 3–0–32–1, 2–0–24–1.  

ఐపీఎల్‌లో నేడు
లక్నో X  ఢిల్లీ 
వేదిక: లక్నో 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement