IPL 2023, MI vs RCB: Most teams in this IPL are taking risks and it is coming off: Rohit Sharma - Sakshi
Sakshi News home page

#Rohit Sharma: ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు! అందుకు ఇదే నిదర్శనం

Published Wed, May 10 2023 10:19 AM | Last Updated on Wed, May 10 2023 11:08 AM

IPL 2023 MI Vs RCB Rohit: Most Teams Taking Risks It Is Coming Off - Sakshi

రోహిత్‌ శర్మ- సూర్యకుమార్‌ యాదవ్‌- విరాట్‌ కోహ్లి (PC: IPL)

IPL 2023 MI Vs RCB: ‘‘పిచ్‌ బాగుంది. ఇలాంటి చోట కాస్త మెరుగ్గా ఆడినా పరుగులు రాబట్టవచ్చు. ఆ నలుగురు అద్భుతంగా ఆడారు’’ అంటూ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తమ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్‌లో దాదాపు అన్ని జట్లు గెలిచేందుకు ఎంతటి రిస్క్‌కైనా వెనకాడటం లేదని, భారీ టార్గెట్ల ఛేదనే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు. 

కోహ్లి విఫలం
ఐపీఎల్‌-2023లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. వాంఖడేలో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ ఆరంభంలోనే ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి(1) వికెట్‌ తీసి శుభారంభం అందించాడు.

అయితే, మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (41 బంతుల్లో 65 పరుగులు) చెలరేగడంతో ఆర్సీబీ కోలుకుంది. డుప్లెసిస్‌కు తోడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌(33 బంతుల్లో 68 పరుగులు) తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌ (18 బంతుల్లో 30) మెరుగ్గా రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 199 పరుగులు చేసింది.

ఇషాన్‌ తుపాన్‌.. సూర్య సునామీ
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి రోహిత్‌ శర్మ ఆరంభంలోనే అవుట్‌ కావడంతో షాక్‌ తగిలినట్లయింది. అయితే, మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(21 బంతుల్లో 42 పరుగులు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తోడు.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 83 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. 

వధేరా ఊచకోత
వీరితో పాటు నేహల్‌ వధేరా మెరుపులు మెరిపించడం(34 బంతుల్లో 52, నాటౌట్‌)తో 16.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. 6 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారంటూ తమ బ్యాటర్లు ఇషాన్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సూర్య, వధేరాలను అభినందించాడు.

అతడి నైపుణ్యాల గురించి తెలుసు
అదే విధంగా తమ పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆకాశ్‌ గతేడాది కూడా మాతో పాటే ఉన్నాడు. అతడి నైపుణ్యాల గురించి మాకు తెలుసు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని భావించాం. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరాఖండ్‌ను ముందుండి నడిపించే ఆకాశ్‌.. ఈరోజు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు. జట్టుకు ఏం కావాలో ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. 

ఆటకు తగ్గ ప్రతిఫలం
ఇక ఆర్సీబీని 200 లోపు స్కోరుకు కట్టడి చేశామన్న రోహిత్‌.. అసలు ఈ పిచ్‌పై ఏది మెరుగైన స్కోరో అంచనా వేయలేకపోయామన్నాడు. ఈ సీజన్‌లో 200 పైచిలుకు టార్గెట్లు ఛేజ్‌ చేసేందుకు జట్లు వెనకాడటం లేదని.. అందుకోసం బ్యాటర్లు తమ ప్రత్యేక నైపుణ్యాలను బయటకు తీసి అద్భుతంగా రాణిస్తున్నారంటూ కొనియాడాడు. గెలుపు రూపంలో ఆటకు తగ్గ ప్రతిఫలం పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశాడు.

చదవండి: నాసిరకం బౌలింగ్‌.. ఐపీఎల్‌ చరిత్రలో ముంబైకి అతిపెద్ద విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement