ముంబై: ఐపీఎల్‌లో మళ్లీ బంతి బలయ్యింది. బ్యాట్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్ కూడా దిగొ చ్చింది. ముందు బెంగళూరు అదరగొడితే... తర్వాత ముంబై అంత పెద్ద లక్ష్యాన్ని చెదరగొట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది.
మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (41 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచేశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ముంబై 16.3 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి 200 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 83; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుతో అదరగొట్టేశాడు. నేహల్ వధేరా (34 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.
క్యాచ్ మిస్ చేయడంతో...
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వధేరా క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన డుప్లెసిస్ తర్వాత ఉతికి ఆరేశాడు. దీంతో ఆరంభంలోనే స్టార్ బ్యాటర్ కోహ్లి (1), అనూజ్ రావత్ (6) అవుటైనా ఆ ప్రభావం కనిపించలేదు. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ఉప్పెనతో పరుగుల ప్రవాహం బెంగళూరును కదంతొక్కించింది. ధాటిగా ఆడి ప్రత్యర్థుల్ని పరిగెత్తించారు.. బౌండరీలతో... వీలైతే సిక్సర్లతో స్కోరుబోర్డును ఉరకలెత్తించారు. 2.2 ఓవర్ నుంచి 12.3 ఓవర్ దాకా బ్యాటింగ్ జోరే స్టేడియం మొత్తాన్ని హోరెత్తించింది.
తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెలే ముందుగా (25 బంతుల్లో) ఫిఫ్టీ చేసుకోగా, కెపె్టన్ డుప్లెసిస్ (30 బంతుల్లో) ఆ తర్వాత అర్ధసెంచరీ చేశాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 120 పరుగుల్ని జతచేశారు. ఎట్టకేలకు మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేసిన బెహ్రెన్‌డార్ఫ్ ముంబై శిబిరాన్ని హమ్మయ్య అనిపించాడు. తర్వాత స్వల్ప వ్యవధిలోనే మహిపాల్ (1), డుప్లెసిస్ కూడా పెవిలియన్ చేరగా వేగం తగ్గింది. దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), కేదార్ (12 నాటౌట్), హసరంగ (12 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయారు.
ముంబై... డబుల్ వేగంతో!
కొండను కరిగించేందుకు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అదే తీరున ఆడి బెంగళూరు శిబిరాన్ని వణికించాడు. దీంతో ఆర్‌సీబీ (5.2) కంటే వేగంగా ముంబై 4.3 ఓవర్లలోనే 50 స్కోరు చేసింది. ఐదో ఓవర్ వేసిన హసరంగ ... ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ (7)లను అవుట్ చేసి బెంగళూరును ఆనందంలో ముంచాడు. అయితే ఈ ఆనందం మాత్రం కాసేపే నిలిచింది. ఆ తర్వాత ఓవర్ నుంచే బాదడంలో స్పెషలిస్టు సూర్యకుమార్ దూకుడు మొదలైంది.
వధేరా కూడా ధాటిగా ఆడటంతో లక్ష్యం కరిగిపోయింది. దీంతో 10.1వ ఓవర్లో ముంబై స్కోరు 100కి చేరితే అక్కడ్నుంచి మరో 20 బంతుల్లోనే (13.3వ ఓవర్లో) 150 పరుగుల్ని వాయువేగంతో అందుకుంది. ఈ క్రమంలో సూర్య 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్‌పై పేలవమైన బౌలింగ్‌తో బెంగళూరు ఏమీ చేయలేకపోయింది.
సూర్యకుమారే కాదు... వధేరా కూడా మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లను బాదేశారు. వైశాక్, హర్షల్ వేసిన చెత్త బంతుల్ని సూర్య సులువుగా చితగ్గొట్టెశాడు. సూర్య, డేవిడ్ (0) వరుస బంతుల్లో అవుటైనప్పటికీ విజయం ముంగిట నిలిచిన ముంబైని సిక్సర్‌తో వధేరా గెలిపించడంతోపాటు అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 1; డుప్లెసిస్ (సి) సబ్–విష్ణు (బి) గ్రీన్ 65; అనూజ్ (సి) గ్రీన్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 6; మ్యాక్స్‌వెల్ (సి) వధేరా (బి) బెహ్రెన్‌డార్ఫ్ 68; మహిపాల్ (బి) కార్తికేయ 1; దినేశ్ కార్తీక్ (సి) వధేరా (బి) జోర్డాన్ 30; కేదార్ జాదవ్ (నాటౌట్) 12; హసరంగ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–136, 4–143, 5–146, 6–185. బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 4–0–36–3, పీయూష్ చావ్లా 4–0–41–0, గ్రీన్ 2–0–15–1, జోర్డాన్ 4–0–48–1, కార్తికేయ 4–0–35–1, ఆకాశ్ 2–0–23–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) అనూజ్ (బి) హసరంగ 42; రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హసరంగ 7; సూర్యకుమార్ (సి) కేదార్ (బి) వైశాక్ 83; నేహల్ వధేరా (నాటౌట్) 52; టిమ్ డేవిడ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వైశాక్ 0; గ్రీన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–51, 2–52, 3–192, 4–192. బౌలింగ్: సిరాజ్ 3–0–31–0, హాజల్‌వుడ్ 3–0–32–0, హసరంగ 4–0–53–2, వైశాక్ 3–0–37–2, హర్షల్ పటేల్ 3.3–0–41–0.
ఐపీఎల్‌లో నేడు
చెన్నై vs ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment