
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఓ సంఘటన త్వరలో చోటు చేసుకోనుంది. పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మహిళా క్రికెట్ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. ఇలా పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ ఈనెల 19న ముంబైలో సమావేశం కావాలని బీసీసీఐ అధికారులు సూచించారు. ఆనంతరం ఆటగాళ్లందరూ 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటారని, ఆ సమయంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలనుకున్న ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఇంగ్లండ్ చేరుకున్నాక ఇరు జట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభిస్తారని పేర్కొంది.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment